శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0061 నామం : సుధాసాగరమధ్యస్థా
"ఓం ఐం హ్రీం శ్రీం సుధాసాగరమధ్యస్థాయై నమః"
ఇది ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "సుధాసాగర మధ్యస్థాయై నమః" అని చెప్పాలి.
సుధా అనే పదానికి - వెన్నెల, అమృతం - అనే అర్థాలే గాక చివరకు సున్నం అనే అర్థం కూడా ఉంది. ఫ్రస్తుతం అమృతం అనే అర్థానికి సంబందించిన మాట గానే తీసుకోవాలి. 'సాగరము అంటే సముద్రము'. 'సముద్రము ' అంటే ముద్రలను తనయందు కలిగినది అని అర్థము. 'ముద్రలు' అంటే అచ్చులు అని అర్థము. ప్రతిసృష్టికి అవసరమైన వాటియొక్క మౌలికమైన అచ్చులను అన్నిటిని 'మృతం' (వినాశనం) కాకుండా, తనలో ఉంచగలుగునది కాబట్టి దీనిని అమృత సముద్రం అంటారు. (సాగర అనే పదాన్ని విడదీస్తే స + అగరం అవుతుంది. గరం అంటే విషం అని అర్థము. దీన్ని బట్టి అగరం అంటే అమృతం అనుకోవచ్చు. 'సు' అంటే చక్కగా 'ధా' అంటే ధారణ చేయునది - అనే అర్థాలను బట్టి 'సుధా' అంటే చక్కగా గుర్తుంచుకొని తనయందు ధరించి, అవసరమైనప్పుడు వ్యక్తము చేయగలుగునది అనే అర్థము వస్తుంది. ఈ అర్థాన్ని బట్టే 'సుధా' అనే పదానికి పైన వివరించిన అమృతము అనే అర్థము వచ్చింది.
సుధాసాగరాన్ని మధిస్తే దానిలో ఇంతకు పూర్వము వున్నవన్నీ బయటపడతాయి. క్షీరసాగరాన్ని మదించినప్పుడు కూడా ఇలాగే ఒక్కొక్కటి బయటపడ్డాయి కదా! అందుకే సృష్టి జరిగే విధానాన్ని గురించి -
“తతః సముద్రోఅర్ణవః, సముద్రాదర్ణవా దధి!
సంవత్సరో అజాయత ! సూర్యా చంద్రమసౌధాతా,
యథాపూర్వమ కల్పయత్.”
అని మహానారాయణమ్ లో చెప్పబడింది.
(పూర్వకల్పంలో లాగానే ఈ కల్పంలో గూడా సంవత్సరము, సూర్యుడు, చంద్రుడు మొదలైనవన్నీ సముద్రం లోంచి బయటకు రాబట్టబడ్డాయి అని దీని భావం).
సాగరాన్నే 'సింధువు' అని గూడా అంటారు. అసంఖ్యాకమైన బిందువుల (Drops) చేరిక అనంతమైన 'సింధువు'ను రూపొందిస్తుంది, లేదా - అనంతమైన సింధువులో (Ocean) అసంఖ్యాకమైన బిందువులు ఉంటాయి. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు 'సుధాసాగర మధ్యంలో” అని అనకుండా “సుధాసింధోర్మధ్యే' అని వ్రాశారు.
మనలో ఈ 'సుధా సింధువు' లేదా 'సుధాసాగరం' ఎక్కడ వుందో తెలుసుకోవాలి. మనం గుర్తు పెట్టుకోవలసిన సన్నివేశాలు, సంఘటనలు, వ్యక్తులు, వస్తువులు మొదలైనవన్నీ మనమెదడులో బిందురూప ముద్రలలో ఉంటాయి. ఈ బిందురూపముద్రల ఉత్పత్తి స్థానాన్ని (Place of birth or 'Source of 'Origin') “యోని” అంటారు.
ఈ యోని' గుణించి తైత్తిరీయోపనిషత్తులో
“సేంద్రయోనిః, యత్రాసౌకేశాంతో వ్యపోహ్య శీరకపాలే” అని చెప్పబడింది. మెదడులో ఈ 'యోని' ఉండే ప్రదేశాన్నే” “సుధాసముద్రము” అని అనవచ్చు. ధారణ చేయవలసిన అనగా గుర్తు పెట్టుకోవలసిన విషయాలు, సన్నివేశాలు, సంఘటనలు, వ్యక్తులు మొదలైన వాటి వివరణాదులు అత్యంత సూక్ష్మపరిమాణం లో ఈ
యోని యందు వుంటాయి. ఇవి విత్తనాల లాగా మెదడులో సూక్ష్మ స్థితిలో ఉండి, అవే తరువాత స్థూలస్థితిలో బయటకు వ్యక్తమౌతాయి.
విషయ విజ్ఞాన వ్యూహమంతా బుద్ధిలో ఇమిడి వుంటుంది కాబట్టి, - సింధు స్థానాన్ని మనలో ‘మానసిక' లేదా 'బుద్దీస్థానము' అనుకోవాల్సి ఉంటుంది.
కల్పలోకంలో భౌతికంగా జరిగే వాటికి ఇక్కడ నుండియే వాటి సంకల్పాలకు ప్రేరణ జరుగుతుంది. కుండలినీయోగంలో ఆజ్ఞాచక్రస్థానాన్ని 'మనస్తత్వ స్థానం' గా (మనోపి భ్రూమధ్యే - 9, సౌందర్యలహరి) చెప్పడం ఇందువల్లనే.
అమ్మవారు సహస్రార మందు వుండే అయ్యవారి (శివుని) పర్యంకంపై - ఆసీనురాలయే ముందు, ఆసీనురాలైనపుడు, క్రిందకు దిగేటప్పుడు గూడా ఈ 'ఆజ్ఞాచక్రస్థానం' అనే పీఠం పైనే పాదం మోపుతుంది. ఈ ఆజ్ఞాచక్రము వద్ద వుండు అమ్మవారి పాదాన్ని ఆశ్రయించి, ఆజ్ఞాబద్ధులై, కార్య నిర్వహణా ప్రేరితులై - త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రులు వరుసగా తమ సృష్టి, స్థితి, లయ కార్యాలను నిర్వర్తిస్తారు. ఈ విషయాన్ని సౌందర్యలహరిలో 'తనీయాం సం పాంసుం...' అనే రెండవ శ్లోకంలో శంకరులు వివరిస్తారు.
చర్మ చక్షువులను మూసి, ఆజ్ఞాచక్ర స్థానాన్ని (భ్రూమధ్య ప్రదేశాన్ని) ధ్యానిస్తే - అమ్మవారి పాదాన్ని ధ్యానించినట్లే ఔతుంది. తత్ఫలితంగా జ్ఞప్తికి కావలసిన విషయాలకు అవగాహన కలుగుతుంది. ఈ మనస్తత్వ స్థానాన్ని "బిందు సరము” లేదా “మానస సరోవరము" అంటారు. (దేవశిల్పి 'మయుడు'
"ఈ బిందుసరం లోంచే మయసభను, అలాగే సృష్టింపబడవలసిన వాటిని బయటకు తీసుకు వస్తాడు. ఈ విషయం భారతంలో చదవవచ్చు).
అమ్మవారు ఆసీనురాలైన “శివపర్యంకం' అమ్మవారి 'మెట్టినిల్లు , (మూలాధారం పుట్టిల్లు). దీనిని శ్రీచక్రంలో కేంద్ర బిందువుగా సంకేతిస్తారు . ఈ లలితా సహస్ర నామాల్లోనే ముందు ముందు వచ్చే 'బైందవాసనా నామం, ఇంతకు పూర్వమే వచ్చిన “సుమేరు శృంగ మధ్యస్థా” అనే నామం - ఈ బిందు స్థానాన్నే సూచిస్తాయి. ఒకే తలంలో నలుపలకల వలే ఉండేది కాకుండా మేరువుతో వుండే దృఢమైన (Three Dimensional) శ్రీ చక్రం - చూడ్డానికి ఒక గోపురం లాగా వుంటుంది. ఆ గోపురం నడినెత్తిన కేంద్రం వద్ద ఒక బిందువు వుంటుంది. అమ్మవారి ఆసనం శ్రీ చక్రంలో ఇదే! ఇది మనలో సహస్రార చక్ర స్థానమే! బ్రహ్మరంధ్ర ప్రాంతములోనే సహస్రార కమల స్థానం వుంటుంది. అమ్మవారు పాదము ఉంచే పీఠస్థానము మనలో ఆజ్ఞాచక్రము వద్ద వుంటుంది.
“సుధాసాగరం లేదా సుమేరు శృంగ మధ్యము, లేదా శ్రీచక్రము కేంద్రబిందువు సూచించు సహస్రార కమల మధ్యమున ఉండునది” అని ఈ నామానికి అర్థము .
"సుమేరు శృంగ మధ్యస్తా నామం నుండి సుధాసాగరమధ్యస్థా" నామం దాకా అమ్మవారు మనలో సూక్ష్మంగా వుండే నివాసం గూర్చి చెప్పబడినది.
మంత్ర ప్రయోగ ఫలితం
చీటికీ మాటికీ చచ్చిపోతానేమో అనే భయం కలిగినవారు, ఆత్మధైర్యానికి ఈ మంత్ర నిత్యం 40 సార్లు జపించండి. మరణభయం, ఇంకా రకరకాల పిరికితనాలు దూరము అవుతాయి. సమస్య వచ్చినా నిర్భయంగా ఎదుర్కొనే ధైర్యం కావాలనుకొనేవారు నిత్యం 27 సార్లు మంత్రాన్ని జపించండి. సకల కార్య సిద్ధికి ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం 1008 దర్భాసనంపై కూర్చుని సూర్యోదయ సమయంలో జపిస్తే, కార్యసిద్ధి అవుతుందని మంత్రశాస్త్రం చెప్తున్నది. మోక్షాసక్తులు వీలున్నప్పుడల్లా మంత్ర జపంచేయడం మంచిది.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0062 నామం : కామాక్షి
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation