శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0045 నామం : పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా
"ఓం ఐం హ్రీం శ్రీం పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః"
ఇది పదహారు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "పద ద్వయ ప్రభాజ్వాల పరాకృత సరోరుహాయై నమః" అని చెప్పాలి.
పదద్వయ = పాదముల జంట యొక్క, ప్రభాజ్వాల = కాంతి సముదాయముచేత,
పరాకృత = తిరస్కరింపబడిన
సరోరుహా = పద్మములు గలది.
"పద్మాల కాంతులను మించిన కాంతులు గల పాదములు గలది" అని ఈ నామానికి అర్థము.
పాదాలను పద్మాలతో పోలుస్తారు గాని అమ్మవారి పాదాల విషయంలో పోల్చడానికి పద్మాలు అంతగా సరిరావు. ఎందుకంటే
1. పద్మాలు నీటిలో ఉన్నప్పుడే కాంతివంతముగా ఉంటాయి. కానీ అమ్మవారి పాదాలు ఎప్పుడైనా ఎక్కడైనా కాంతులు విరజిమ్ముతూనే వుంటాయి.
2. పద్మాలు చలికి , రాత్రికి ముడుచుకుపోతాయి. ఇంక అలాంటప్పుడు ఆ పద్మాల నుండి ఆ సమయాలలో కాంతులు ఎలా వస్తాయి? కానీ అమ్మవారి పుట్టినిల్లు ఆ హిమవత్పర్వతము మీద - అంటే మంచు కొండమీద. అందుకే పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ చల్లదన ప్రభావం అమ్మవారి పాదాలపై ఉండదు. మెట్టినిల్లు కైలాసం. అదీ అంతే ! అందుకని ఎంత చల్లగా ఉన్న అమ్మవారి పాదపద్మాలు ముడుచుకుపోవు. పగలు, రాత్రి కూడా పాదాలు వికాసవంతం గానే ఉంటాయి.
3. పద్మాల వికాసం కొన్ని రోజులు మాత్రమే, అటుపైన వాడిపోతాయి. కానీ, అమ్మవారి విషయములో పాదాలు సుస్థిరముగా, శాశ్వతముగా ప్రకాశవంతముగానే ఉంటాయి.
4. పద్మాలు తెలుపురంగులోను, ఎఱుపురంగులోను ఉంటాయి. ఈ రెండు రంగులకు చిహ్నాలుగా అమ్మవారి రెండు పాదాలు ఉంటాయి. ఈ పాదాలు ఇటు పగటిపూట 'వేరాజుకు',(సూర్యునికి ) రాత్రిపూట 'రేరాజుకు (చంద్రునికి) గూడ ఆప్తులే.
"బ్రహ్మ విష్ణు మహేశాన వేద పూజితాంఘ్రిద్వయే" అని వశిష్టుల వారు అంటారు. అంటే బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల చేత, వేదాల చేత పూజింపబడే పాదాలు కలది (అమ్మవారు) అని అర్థము
మంత్ర ప్రయోగ ఫలితం
విద్యార్థులు ఈ మంత్రాన్ని జపిస్తే చదువు యందు శ్రద్ద కలిగి బాగా చదువుతారు . దారిద్య్ర నిర్మూలనకు ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం రోజు 108 సార్లు జపించాలి. మారేడు చెట్టు క్రింద జపిస్తే త్వరగా ఫలితం వస్తుంది. అవకాశం లేని వారు ఇంట్లో ఐన జపించవచ్చు.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0046 నామం : శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజ
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation