శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0045 నామం : పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా
"ఓం ఐం హ్రీం శ్రీం పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః"
భాష్యం
పాదముల సౌష్టవము మొదలైన గుణ సమూహమువచే తిరస్కరించబడిన తామరలు గలది. దేవి పాదముల కాంతులచే కమలములు సైతము తిరస్కరించబడుతున్నాయి. అనగా దేవిపాదాలు పద్మాలవలె ప్రకాశిస్తున్నాయి. వాటియొక్క కాంతులముందు పద్మాలుకూడా వెలవెలబోతున్నాయి. పాదములయొక్క కాంతిచే తిరస్కరించబడిన పద్మాలయా అని గనక చెప్పినట్లైతే లక్ష్మీ సరస్వతులకు తల్లియైన పరాభట్టారిక అని అర్ధం.
అర్చిష్మతి, మహస్వతి, జ్యోతిష్మతి. అనబడే అగ్ని సూర్య, చంద్రకళలు ఇవి మొత్తం 360 అని గతంలో వివరించటం జరిగింది. ఈ కళలు మండలాకారంగా వ్యాపించి పిండాండ పబ్రహ్మాండాలను ప్రకాశింపచేస్తున్నాయి. వీటివల్ల సుధాధారలు కురిసి శరీరంలోని 72000 నాడీమండలం తడుస్తుంది. ఈ 360 కళలు ఒక సంవత్సరానికి ప్రతీక ప్రజాపతి సంవత్సర స్వరూపుడు. సంవత్సరోవై ప్రజాపతిః ఈ కళలన్నీ దేవిచరణారవిందముల నుండే ఉత్పన్నమైనాయి.
శంకర భగవత్సాదులవారు ఈ విషయాన్ని తన సౌందర్య లహరిలోని 14వ శ్లోకంలో వివరిస్తూ
క్షితౌ షట్పంచాశ - ద్ద్విసమధిక పంచాశ దుదకే
హుతాశే ద్వాషష్టి - శ్చతురధిక పంచాశ దనిలే |
దివి ద్విఃషట్త్రింశ - న్మనసి చ చతుఃషష్టిరితి యే
మయూఖాస్తేషామప్యుపరి తవ - పాదాంబుజయుగమ్ || 14 ||
మూలాధార చక్రమందు - 56
జలతత్వాత్మకమైన మణిపూర చక్రమందు - 52
వెరసి 108. ఇవి అగ్నిజ్వాలలు
అగ్ని తత్వాత్మకమైన స్వాధిష్టానచక్రమందు - 62
వాయుతత్వాత్మకమైన అనాహతచక్రమందు - 54
వెరసి 116. ఇవి సూర్యకిరణాలు
ఆకాశతత్త్వాత్మకమైన విశుద్ధి చక్రమందు - 79
మనస్తత్వాత్మకమైన ఆజ్ఞాచక్రమందు - 64
వెరసి 186 ఇవి చంద్రకళలు. మొత్తం కలిపి 360 కిరణాలు చరాచర జగత్తును ప్రకాశింప చేస్తున్నాయి.
ఈ మొత్తం 360 కిరణాలు బ్రహ్మరంధ్రం దగ్గర దర్శనమవుతాయి. సాధకుడు ఆధారచక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తిని గనక జాగృతం చేసినట్లైతే, అది గ్రంధిత్రయాన్ని దాటి సహస్రారం చేరుతుంది. అప్పుడు సహస్రదళ పద్మంలో నుంచి జాలువారే అమృతపు జల్లులతో సాధకుని శరీరంలోని 72000 నాడీ మండలము తడపబడుతుంది. ఆ 360 కిరణములచేత చరాచర జగత్తు ప్రకాశిస్తుంది అంటే అర్ధం ఇదే.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below