శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0041 నామం : ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూణాభజంఘికా
"ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికాయై నమః"
ఇది పదహారు అక్షరాల నామం . ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు
"ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికాయై నమః" అని చెప్పాలి.
ఇంద్రగోప = ఆరుద్ర పురుగుల చేత,
పరిక్షిప్త = చుట్టును పొదగబడిన (తాపబడిన),
స్మర = మన్మధుని యొక్క,
తూణ = అమ్ముల పొదులతో,
ఆభ = ఒప్పు,
జంఘికా = పిక్కలు గలది.
ఈ నామం లోని 16 అక్షరాల కలిపి ఒకేసారిగా చెప్పాలి . శ్రీ దేవీ పిక్కలు అమ్ముల పొదలతో పోల్చబడి యున్నవి, మన్మధుని పుష్ప బాణాలు ఉంచు పొదలువలె యున్నవి, ఎఱ్ఱని రంగు అంటే అరుద్రపురుగు రంగు అది అందమైన ఎరుపు కాంతివంతంగా అమ్మవారి పిక్కలు గోచరించునని భావము. శ్రీ దేవి సమస్త కామములు వర్షింపగల శక్తి స్వరూపిణి మోక్ష కాముకులకు మోక్షము అందించగల శక్తి ఆమె పిక్కలకు ఉన్నది. బలహీనపు పిక్కలు గలవారు అమ్మవారి పిక్కలు వర్ణమును ధ్యానించిన కామపూరణము సిద్దించును.
ధర్మ విరుద్ధము కానీ కామము మోక్షమే. కామి గాని వాడు మోక్షకామి కూడా కాలేడు అంటే, మోక్షము పొందాలి అన్న కోరిక లేని వాడు ఎప్పటికి మోక్షాన్ని పొందలేడు అని అర్థం. అందువలన కామమే సృష్టికి అందుండి మోక్షానికి ఆధారమగు శక్తి. అట్టి కామ శక్తి పిక్కలకు ఉన్నది అని శాస్త్రము తెలుపుచున్నది .సమస్త కామములనేడి అమ్ములను అమ్మవారు తన ఎఱ్ఱని అందమైన పిక్కలనెడి పొదల్లో రహస్యముగా దాచి ఉంచేనని భావము.
ఆరుద్ర పురుగులు గురివింద గింజల్లాగ బాగా ఎఱ్ఱగా ఉంటాయి. మన్మథుడు వాడే అమ్ముల పొదుల మీద ఆరుద్ర పురుగులు పొదగబడి ఉంటాయి. అప్పుడు అవి చూడటానికి చాలా అందముగా కనబడతాయి. అమ్మవారి రెండు పిక్కలు సరిగా అంత రమణీయముగా ఉంటాయట.
శంకరాచార్యులవారు గూడ సౌందర్యలహరిలో అమ్మవారి పిక్కల్ని ఇలాగే మన్మథుని అమ్ముల పొదులతోనే పోలుస్తారు. అమ్ములపొడులలో బాణాలు ఉండాలిగా అంటే - ఒక్కొక్క పిక్క క్రింద పాదానికి ఐదు ఐదుగా ఉన్న వేళ్లే ఆ బాణాలు అంటారు.
అయితే మన్మథుడు ఉపయోగించేది ఐదే బాణాలు గదా అంటే - సామాన్యుల మీదకు ఐదు బాణాలు చాలు గాని అసామాన్యుడైన శంకరుని జయించాలంటే - రెట్టింపు బాణాలుండాలని - పది బాణాలను రెండు అమ్ములపొదుల్లో ఐదు, ఐదు చొప్పున పెట్టుకొని శంకరునిపై యుద్దానికి వెళ్ళాడు అంటారు. అయితే చివర సానబెట్టబడిన ములుకులు ఉండాలి కదా అంటే - వేళ్ళ గోళ్లు చూడండి - సకల దేవతా మూర్తులు అమ్మవారికి శిరస్సు వంచి నమస్కరించినపుడు వారి కిరీటాలకు ఉన్న రత్నాలచేత అమ్మవారి గోళ్లు బాగా సానబెట్టబడ్డాయి అంటారు. శంకరులను ఇంకేం ప్రశ్నిస్తాము?
'ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మధుని అమ్ముల పొదులను పోలిన పిక్కలు గలది' అని ఈ నామానికి అర్థము.
మంత్ర ప్రయోగ ఫలితం
కోరుకున్న రూపం కల భార్య కావాలని కోరుకునే పురుషులు, కోరిన రూపంకల భర్త కావాలని కోరుకునే స్త్రీలు ఈ మంత్రాన్ని అత్యంత భక్తితో రాత్రిపూట రోజూ పడుకునేముందు 1008సార్లు జపిస్తే ఆ కోరిక శీఘ్రకాలంలోనే తీరుతాయి.
ధ్యాన మంత్రం : ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికాయై నమః
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0042 నామం : గూఢగుల్ఫా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation