శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0038 నామం : రత్నకింకిణికా రమ్య రశనాదామ భూషితా
"ఓం ఐం హ్రీం శ్రీం రత్నకింకిణికారమ్యరశనాదామభూషితాయై నమః"
ఇది పదహారు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "రత్నకింకిణీకారమ్యా రశనాదామభూషితాయై నమః" అని చెప్పాలి.
రత్న = రత్నములతో కూడిన,
కింకిణీకా = చిరుగంటలతో,
రమ్య = అందమైన,
రశనా+ దామ = ఒడ్డాణపు త్రాటిచేత,
భూషితా = అలంకరించబడినది.
అమ్మవారి నడుముకు ఉన్న ఒడ్డాణం - అంచులవద్ద చిరుగంటల గజ్జెలతోను, పొదగబడిన రత్నాలతోను అత్యంత రమణీయంగా వుంటుందట.
భూమికి - భూమధ్యరేఖ లాగా, మగవారికి - మొలత్రాడు లాగా, స్త్రీలకూ వడ్డాణం నడుము చుట్టూర ఉంటుంది. చీర కుచ్చెళ్ళు బయటకు చెదరకుండా పట్టి ఉంచడమే కాకుండా, ఒడ్డాణం - స్త్రీల సన్నని నడుముకు శోభను, అందాన్ని చేకూరుస్తుంది. మొత్తం నిలువెత్తు మనిషిని రెండుభాగాలుగా మంచి సౌష్టవరీతిలో సర్దుబాటు చేసినట్లుంటుంది. కటి ప్రదేశం "తులారాశికి " సంబందించినది. అన్ని రాశులలోకి "తులారాశి" అందానికి సంబందించినది. ఆంగ్లములో ఈ రాశిని "Lovely Libra" అంటారు.
ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడంటేనే "శుభము" అని వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి, ఈ కటి ప్రదేశ మేఖల (ఒడ్డాణం) చేత అమ్మవారు మరింత శోభాయమానంగా ఉంటుంది.
అమ్మవారి నడుముకు ఉండే ఈ ఒడ్డాణాన్నే శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో "క్వణత్కాంచీదామా" అనీ 7 వ శ్లోకం లో అన్నారు. ఈ ఒడ్డాణం తో ప్రారంభించి, అమ్మవారి సుందర వ్యక్త స్వరూపాన్ని ఏంతో చక్కగా వర్ణించారు. రత్నాలతోను చిరుగంటల గజ్జెలతోను అత్యంత రమణీయంగా ఉండే ఒడ్డాణపు త్రాడు కలిగినది అని అర్థము.
అమ్మవారిని తెలుసుకోవటం కోసం చేసే ఈ ప్రయత్నంలో ఇంతవరకు అమ్మవారి జ్ఞాత భాగం చెప్పబడినది.
మంత్ర ప్రయోగ ఫలితం
మంచి కంఠం ఉన్నప్పటికీ, భాషా పాండిత్యం ఉన్నప్పటికీ, మరెన్నో శుభ లక్షణాలున్నా, వేదిక ఎక్కేసరికి సరిగ్గా ప్రవచనం చేయలేక రాణించలేనివారు ఎందరో ఉన్నారు. అలాంటి వారు ఒక్క ఏడాది ఈ మంత్రాన్ని భక్తితో రోజూ 54 సార్లు జపిస్తే మంచి వక్తలుగా పేరు తెచ్చుకొంటారు. సువర్ణ రత్నా భరణాలు కావాలని ఉన్నా కొనుక్కోలేనివారు ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం ఉదయం మరియు రాత్రి కాలంలో 108 సార్లు జపించి, వాటిని పొందగలరు. తరచుగా నగలు పోగొట్టు కొనేవారు, ఈ మంత్రాన్ని రాత్రిపూట పడుకోబోయే ముందు భక్తితో 27 సార్లు జపిస్తే నగలు భద్రంగా ఉంటాయి. దొంగల పీడ ఉండదు.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read 0039 నామం : కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation