శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదవ నామం : మనోరూపేక్షు కోదండా
"ఓం మనోరూపేక్షుకోదండాయై నమః"
అమ్మవారు ఒకచేతిలో చెఱుకు విల్లు ధరిస్తుంది. దీనిని సంస్కృతంలో పుండ్రేక్షువు అంటారు. తెలుగులో నామాల చెఱకు అంటారు. నామాల చెఱకు ఆపాదమస్తకం మధురంగా ఉంటుంది. అమ్మవారు తన మనస్సును చెఱకుగడగా మర్చి దానినే విల్లుగా చేసుకొని చేతిలో ఉంచుకుంది. ఈ మనోరూపమైన మాధుర్యానికి లొంగనివారు ఎవరుంటారు? ప్రేమతో ఎవరినైనా లొంగదీసుకోవచ్చు. భయపెట్టడం వలన వచ్చే ఫలితం శూన్యం అని అమ్మవారు భావిస్తున్నదని మంత్రార్ధము. ఇది అమ్మవారి క్రియాశక్తి. మనస్సుని అదుపులో పెట్టి ఆ మనస్సులో మాధుర్యాన్ని నింపే శక్తిని చేతిలో పట్టుకున్న అమ్మవారిని "లలితా త్రిశతి"లో "అతిమధుర చాప హస్తాం" అని ధ్యానిస్తాడు హయగ్రీవుడు. ధనుస్సు శత్రువులను చంపే ఆయుధం. కానీ అమ్మవారి ధనుస్సు కామక్రోధాది అంతఃశత్రులను అదుపులో పెట్టె ఆయుధం. అందుకే ఆ ఆయుధం పరమ పవిత్రం. శక్తివంతం. ఈ ఆయుధంతో అమ్మవారు మన బుద్ధిని కూడా సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. దేవీభాగవతం ప్రారంభంలో "బుద్ధియానః ప్రచోదయాత్" అనే వేదమంత్రం ఉన్నది. బుద్దిని తద్వారా మనస్సుని ప్రేరేపించేది అమ్మవారేనని దీనివల్ల తెలుస్తుంది. ఈ యుగంలో అందరికీ మనశ్శాంతి కరువైపోతోంది. నిమిషానికొక విధంగా మన మనస్సులు ప్రవర్తిస్తున్నాయి. అందువల్ల మనశ్శాంతికి, మనస్సును అదుపులో పెట్టుకోవడానికి బుద్ధి సక్రమంగా ప్రవర్తించడానికి ఈమంత్రం సహకరిస్తుంది.
మంత్రప్రయోగం ఫలితం
"ఓం మనోరూపేక్షుకోదండాయై నమః"
ఈమంత్రాన్ని నిత్యం 11 సార్లు జపించడం మంచిది. సరియైన నిర్ణయం తీసుకోలేక తన జీవితాన్ని ధనాన్ని పాడుచేసుకునే వ్యక్తికోసం అగస్త్యుడు ఒక చక్కటి విధానాన్ని చెప్పాడు. చేతిలో చిటికెడు విభూతి పట్టుకొని రోజుకి 108 సార్లు చొప్పున ఈమంత్రాన్ని 41 రోజులు జపించాలి. జపం అయ్యాక విభూతి నుదుట ధరించాలి. జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో, ఏ నిర్ణయం జీవితాన్ని ఆనందమయం చేస్తుందో జపం చేసేవారికి స్ఫురిస్తుంది. విద్యార్థులు ముఖ్యంగా ఈమంత్రాన్ని జపం చేస్తే తమ జీవితాన్ని తామే నిర్దేశించుకోగలరు.
ఓం శ్రీ మాత్రే నమః
Click & Read లలితా రహస్య నామ భాష్యము
Read పదకొండవ నామం : పంచతన్మాత్ర సాయకా
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow వాస్తు హౌస్ Face Book Page
Contact for Online Vasthu Consultation