శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదవ నామం : మనోరూపేక్షు కోదండా
"ఓం మనోరూపేక్షుకోదండాయై నమః"
భాష్యం
జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేవి ప్రతిజీవికి ఉంటాయి. అందుచేతనే ఆహార నిద్రామైథునాలు జీవులన్నింటికీ సమానంగానే ఉంటాయి. కాని సంకల్పవికల్పాలకు కారణమైనది మనస్సు. ఇది పదకొండవ ఇంద్రియము. మానవుడికి మాత్రమే ఉంటుంది. దీనివల్లనే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ అనేది ఉంటుంది. ఏది ధర్మం. ఏది అధర్మం అనే విషయాలు నిర్ణయించుకోగలుగుతాడు.
మనోరూపమైన చెరకువిల్లును ఎడమవైపు క్రిందిచేతితో ధరించి ఉంటుంది. బాణం వెయ్యాలి అంటే ఎడమచేత్తో ధనుస్సును పట్టుకుని కుడిచేతితో నారిసారించి బాణం వదలాలి. అందకని పరమేశ్వరి ఎడమచేతిలో ధనుస్సు ఉంటుంది. ఇది క్రియాశక్తి.
మన్మథుడి ఆయుధం చెరకు విల్లు. అందుచేతనే కాళిదాసు ఆ దేవిని స్తుతిస్తూ పుండ్రేషుపాశాంకుళ పుష్పబాణ హస్తే అంటాడు. అంటే చేతిలో చెరకు విల్లు, పాశము అంకుశము, ధరించినది. మన్మధుడు అంటే మనసును మధించేవాడు. అతడి యొక్క విల్లు తీయనైన చెరకుతో చేయబడింది.
అదేవిధంగా పరమేశ్వరి చేతిలోని విల్లుకూడా చెరుకువిల్లే. ఆవిడ మనసు కూడా మధురమైనదే. కోదండము శతృభయంకరము. మనసు చంచలమైనది. దానికి స్థిరత్వం ఉండదు. అందుకే మనసు కోతిలాంటిది. కోతి ఒక కొమ్మ మీదనుంచి ఇంకొక కొమ్మమీదకు ఏవిధంగా గెంతుతుందో, అదేవిధంగా మనసు కూడా ఒక విషయం నుంచి ఇంకొక విషయం మీదకు వెడుతూ ఉంటుంది. మనసును నిశ్చలం చెయ్యగలిగితే సమాధిస్థితి వచ్చినట్లే. ఎప్పుడైతే సమాధిలోకి వెళ్ళగలిగాడో, అప్పుడు అతడికి ఆత్మసాక్షాత్కారమైందన్న మాటే. అటువంటివ్యక్తికి విశాలమైన ఈ విశ్వమంతా రజ్జు
సర్పబ్రాంతి అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనసును ఏకాగ్రం చెయ్యగలిగిన వాడికి
ఆత్మసాక్షాత్కారం త్వరగా జరుగుతుంది.
విషయమే ఆకారంగా గలది మనసు. జీవుల యొక్క మనోవృత్తియే దేవి చేతిలో ఉన్న కోదండము. మనసు అనేది కామనాశక్తి సంకల్పవికల్పాలనబడే పదకొండు మనోవృత్తులచేత ప్రభవించే కర్మాగారమే మనస్సు.
అవి :
1. కామము 4. శ్రద్ధ 7. అధృతి 10. భీః
2. సంకల్పము 5. సత్యము 8. శ్రీః 11. ధీః
3. వికల్పము 6. ధృతి 9. హ్రీం
ప్రతిజీవికి తన మనసులో ఉండే ప్రీతి విశ్వాసాలు ఇక్షుభావసూచితాలు. ఈ పదకొండు మానసిక అవాంతర భేదములు. మనసులోని ఈ అవాంతరము ప్రాణి యొక్క జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఇవి సామాన్యుడి యందు ఒక రకంగా ఉంటే ఉత్తముడియందు ఇంకొక రకంగా ఉంటాయి. పామరుడికి నిత్యము సత్యము అనిపించే ఈ జగత్తు జ్ఞానికి అనిత్యము అనిపిస్తుంది. అస్థిరము అనిపిస్తుంది.
జీవియొక్క స్థూలదేహము నశిస్తుంది. కాని సూక్ష్మదేహము నశించదు. అది గతజన్మలో చేసిన పాపపుణ్యాలవల్ల లభించే స్వర్గనరకాలనుభవించి కర్మఫలశేషాన్ని అనుభవించటానికి ఇంకొక జన్మ ఎత్తుతుంది. గత జన్మ చివరలో ఏ కోరికలుంటాయో, దేన్ని గురించైతే మరణకాలంలో తీవ్రంగా ఆలోచిస్తుంటాడో వాటియొక్క వాసనలు ఈ జన్మలో కూడా ఉంటాయి. వాటికి తోడుగా క్రొత్తవి కూడా వస్తాయి. వీటన్నింటినీ ప్రవర్తింపచేసేవాడు పరమేశ్వరుడు. మనస్సు అనేది క్రియాశక్తి. అందుచేతనే క్రియాశక్తి రూపమయిన ధనుస్సు మనస్సుగా చెప్పబడుతోంది. నవావరణ పూజలో ఎనిమిదవ ఆవరణలో దేవి ఆయుధమయిన ధనుస్సును పూజిస్తారు.
ఓం ఐం హ్రీం శ్రీం థంధం సర్వసమ్మోహనాభ్యాం
కామేశ్వరీ రమేశ్వధనుర్భ్యాం నమః ధనుః శ్యక్తి
శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః
దుర్వాస మహర్షి శ్రీ దేవీ మహిమ స్తుతిలోని 41వ శ్లోకంలో దేవి ఆయుధమైన ధనుస్సును ధ్యానిస్తూ
అథ తవ ధనుః పుండ్రేక్షూకృత్ ప్రసిద్ధ మతిద్యుతి
త్రిభువన వధూ ముద్య జ్యోత్స్నా కలానిధి మండలం
సకలజనని ! స్మారం స్మారం గతః స్మరతాం నరః
త్రిభువన వధూ మోహామ్మోధేః ప్రపూర్ణవిధు ర్భవేత్ |
తల్లీ నీ చేతిలో ఉన్న పుండ్రేక్షుచాపము లోకాలలోని సుందరీమణుల మనస్సులలో విరహ బాధ కలిగిస్తుంది. అటువంటి నీ దుఃఖబీజాన్ని ఉపాసించే వాడు స్త్రీలను వశం చేసుకోగలుగుతాడు.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below