కార్తీకపురాణం 6 వ అధ్యాయం
కార్తీకపురాణం 6 వ అధ్యాయం
ఏ మానవుడు కార్తీకమాసం నెలరోజులూ పరమేశ్వరుని శ్రీమహావిష్ణువును, పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచిగంధపు నీటితో భక్తిగా పూజించునో, అలాంటి వానికి అశ్వమేథ యాగము చేసినంత పుణ్యము దక్కుతుంది. అట్లే ఏ మానవుడు కార్తీకమాసమంతా దేవలయంలో దీపారధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానము చేయుట యెట్లనగా పైడిప్రత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గాని, గోదుమపిండితోబ్గాని ప్రమిదవలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపము వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానమియ్యవలెను. శక్తి కొద్ది దక్షణ కూడా ఇయ్యవలెను. ఈ ప్రకారంగా కార్తీకమాస మందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగాపోసి వెనుకచేసిన ప్రకారంగా గోదుమపిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపము వెలిగించి ఈ నెలరోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇదికూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటమేకాక మోక్షప్రాప్తి కలుగుతుంది. దీపాదానము చేయువారు ఇలా వచింపాలి.
◆ శ్లో||. సర్వజ్ణాన ప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ.
అని స్తోత్రంచేసి దీపదానము చేయవలెను. దీని అర్థమేమనగా " అన్ని విధముల జ్ణానం కలుగజేయునది, సకల సంపదలను ఇచ్చునది అగు ఈ దీపదానమును చేయుచున్నాను. కావున నాకు శాంతి కలుగుగాక!" అని. దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారధన చేయవలెను. శక్తి లెని యెడల పదిమంది బ్రాహ్మణులకైననూ భోజనం పెట్టి తాంబూలమియ్యవలెను. దీని గురించి ఒక ఇతిహాసము కలదు..
◆ || లుబ్ది వితంతువు స్వర్గమున కేగుట ||
పూర్వకాలమున ద్రవిడదేశ గ్రామంలో ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయెను. సంతానముగాని, ఆఖరికి బంధువులుగాని లేరు. అందుచేత ఆమె ఇతరుల ఇండ్లలో దాసిపని చేస్తూ, అక్కడే భుజిస్తూ, వారి సంతోషం కొద్ది ఎమైన వస్తువులిస్తే ఆ వస్తువులను ఇతరులకు హెచ్చుధరలకు అమ్ముకుంటు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బు కూడబెట్టుకొంటు, దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము కూడాబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కొంతకాలం జరిగెను.
ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గమధ్యంలో ఈ స్త్రీ వున్న గ్రామానికి వచ్చి ఆ రోజు అక్కడొక సత్రంలో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలో మంచిచెడ్డలు తెలుసుకోని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకోని ఆమె వద్దకు వెళ్లి " అమ్మా! నా హితవచనము ఆలకింపుమూ, నీకు కోపము వచ్చిన సరే వినుము, మన శరీరములు శాశ్వతము కావు. నీటి బుడగలవంటివి. ఏ క్షణంలో మృత్వువు మనల్ని తీసుకొని పోవునో ఏవరూ చెప్పలేరు. పంచభూతాలు, సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము-జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయరగును. అటివంటి ఈ శరీరమును నీవు నిత్యమని తలచి భ్రమిస్తున్నావు. ఇది అజ్ణానముతో కూడిన దురాలోచన.
తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడత దాన్ని తిన్నెద్దామని భ్రమిణ్చి, దగ్గరికి వెళ్లి భస్మమౌతుంది. అలాగే మానవులు కూడా ఈ తనువ్ శాశ్వతమని నమ్మి, అంధకారంలోబడి నశిస్తున్నారు. కావున నా మాటవిని నీవు తినకుండా, ఇతరులకు పెట్టకుండా, అన్యాయంగా ఆర్జించిన ధనమును ఇప్పుడైన పేదలకు దానధర్మలు చేసి పుణ్యము సంపాదించి. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికాలు చేసి మోక్షమును పొందుము. నీ పాపపరిహార్థముగా వచ్చే కార్తీకమాసమంతా ప్రాతఃకాలమున నదీస్నానమాచరించి, దానధర్మలు చేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతవై సకల సౌభాగ్యములను పొందగలవు" అని ఉపదేసించెను.
ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని ఆ రోజునుంచి దానధర్మలు చేస్తూ కార్తీకమాస వ్రతమును ఆచరించుట వలన జన్మరాహిత్యమై మోక్షమును పొందెను.
ఆరవ రోజు పారాయణము సమాప్తము.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే 6వ అధ్యాయం స్సమాప్తః
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !
- స్వస్తి-
|| ఓం శ్రీమాత్రేనమః ||