కార్తీకపురాణం 7 వ అధ్యాయం
కార్తీకపురాణం 7 వ అధ్యాయం
ఏడవ రోజు పారాయణము
వసిష్ఠ మహాముని ఇలా చెబుతున్నారు. ఓ జనక మహారాజా! విను.
కార్తీకమహాత్మ్యమును ఇంకా వివరిస్తాను. ప్రసన్న చిత్తుడవై విను. కార్తీకమాసము లో ఎవరు కమలముల చేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజిస్తారో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యమూ నివాసముంటుంది.
● ఈ మాసములో భక్తితో తులసీదళములతోనూ, జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాగ, చంపక ఇత్యాదులతోనూ శ్రీ హరిని పూజించువాడు తిరిగి భూమిమీద జన్మించడు. ఈ మాసమున మారేడుదళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి ఈ భూమిమీద జన్మించడు.
కార్తీక మాసములో భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశిస్తాయి. ఉసిరిక కాయలతో ఉన్న ఉసిరి చెట్టు క్రింద శ్రీ హరిని పూజించు వానిని యముడు కన్నెత్తి చూసే సాహసమైనా చేయజాలడు.
● కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును, దానిలో సందేహమేలేదు. కార్తికమాసలో బ్రాహ్మణులతో కూడా వనభోజన మాచరించు వాని మహాపాతకములన్నీ నశిస్తాయి. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపద మొందగలడు.
● కార్తీకమాసము లో భక్తితో శ్రీ హరి ఆలయములో మామిడి ఆకులతో తోరణము కట్టిన వానికి మోక్షము దొరుకుతుంది. శ్రీ హరికి అరటి స్తంభములతో గానీ, పువ్వులతో గానీ మంటపాన్ని నిర్మించి, పూజించిన వానికి వైకుంఠములో చిరకాల వాసము కలుగుతుంది. ఈ కార్తీక మాసములో ఒక్కసారైనా హరి ముందు సాష్ఠాంగ ప్రమాణము చేసిన వారు పాపముక్తులై అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలరు.
● హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి వెళ్ళగలరు. ఈ మాసము స్నానము చేసి, తడిబట్టలతో ఉన్నవానికి వస్త్రదానము చేసిన వాడు పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలాన్ని పొందుతాడు.
● కార్తీకమాసము లో విష్ణువుయొక్క ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి లాగా నశించి పోతాయి. ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసిపువ్వులతో శ్రీ హరిని పూజిస్తే పదివేల యజ్ఞములు చేసిన ఫలము లభిస్తుంది. ఈ మాసములో బృందావనముని ఆవు పేడతో అలికి, రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీ హరికి ప్రియురాలు కాగలదు.
● కార్తీక మాసమున విష్ణుభగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫలాన్నీ వర్ణించడం బ్రహ్మకు కూడా శక్యము కాదు. (నందా దీపము అంటే, ప్రతిపత్తిథి, షష్ఠీ తిథి, ఏకాదశీ తిథులలో సమర్పించే దీపము). ఈ నందాదీపము ఆచరించని వారు వ్రతభ్రష్టులనిపించుకుంటారు. కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీ హరికి సమర్పించాలి. కార్తీక మాసములో శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు.
● కార్తీక మందు విష్ణ్వాలయములోని మంటపంను భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందగలరు. ఈ మాసములో మల్లెపూవులతో శ్రీ హరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్లలాగా నశిస్తాయి. తులసీ గంధముతో సాలగ్రామమును పూజించిన వాని పాపములు దద్గమై విష్ణులోకాన్ని చేరగలడు.
● హరి సన్నిధిలో స్త్రీగానీ, పురుషుడుగానీ నాట్యము చేసినట్టయితే, పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడ నశిస్తాయి. ఈ మాసంలో భక్తితో అన్నదానమాచరించువాని పాపములు గాలికి కొట్టుకుపోయిన మబ్బులలాగా తేలిపోతాయి.
● కార్తీక మాసములో తిలాదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము అనే నాలుగు ధర్మములు ఆచరించాలి. ఈ మాసములో దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరవాత చండాలుడవుతాడు. స్త్రీగానీ, పురుషుడుగానీ కార్తీక వ్రతమాచరించనివాడు గాడిదగా ముందు జన్మించి తరవాత నూరు మార్లు కుక్కగా జన్మిస్తాడు.
● కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీ హరిని పూజించిన వారు సూర్య మండలమును దాటి స్వర్గలోకమునకు చేరుకుంటారు. మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడుజన్మలు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మిస్తాడు. ఈ మాసములో పద్మములతో శ్రీ హరిని పూజించిన వారు సూర్యమండలమందు చిరకాలవాసి కాగలడు. అవిసెపువ్వుల మాలను ధరించి శ్రీ హరినీ అవిసెపువ్వుల మాలికలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు.
● స్త్రీలు మాలల చేత కానీ తులసీదళాల చేత కానీ ఈ మాసమందులో హరిని పూజించినట్టయితే పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసినట్టయితే, మాసమంతా స్నానమాచరించిన పుణ్యము కలుగుతుంది.
● ఈ మాసములో శుక్ల ప్రతిపత్తిథినాడు, పూర్ణిమనాడు అమావాస్యనాడు ప్రాతఃస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు. అందుకు కూడా శక్తిలేని వారు కార్తీక మాసములో నెలరోజులూ కార్తీక మాహాత్మ్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశిస్తాయి
● ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందే వారి పాపములు కూడా ఏ సందేహము లేకుండా నశించిపోతాయి. ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందుతాడు. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించిన వాడు వైకుంఠాన్ని చేరుకుంటాడు .
ఇతి స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, ఏడవ అధ్యాయము - ఏడవ రోజు పారాయణము సమాప్తము.
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !
- స్వస్తి-
|| ఓం శ్రీమాత్రేనమః ||