శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0065 నామం : భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా
"ఓం ఐం హ్రీం శ్రీం భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితాయై నమః"
భాష్యం
గతంలో పరమేశ్వరుని 5వ నామంలో దేవకార్యసముద్యతా అని చెప్పటం జరిగింది.
అంటే దేవతల కార్యములు నెరవేర్చటం కోసమని దేవి ఆవిర్భవించింది. దేవతల కార్యము
ఏమిటి? దుష్టశిక్షణ, శిష్టరక్షణ.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ॥
లోకంలో ధర్మం నశించి అధర్మం ఎప్పుడైతే పెచ్చుమీరిపోతుందో అప్పుడు ఆత్రత్రాణపరాయణుడైన శ్రీమన్నారాయణుడు భూలోకంలో అవతరించి ధర్మసంస్థాపన చేస్తాడు అని గీతలో చెప్పబడింది. దానికి కారణం కూడా పరమేశ్వరే.
బ్రహ్మమానసపుత్రుడు భృగువు. అతని భార్య “ఉశన” వీరికుమారుడు శుక్రుడు. అంగిరసుని కుమారుడు బృహస్పతి. వీరిద్దరూ అంగిరసుని దగ్గరే విద్యాభ్యాసం చేశారు. అయితే బృహస్పతి దేవగురువు శుక్రాచార్యుడు రాక్షసగురువు అయ్యారు.
ఒకసారి దేవదానవులకు ఘోరమైన యుద్ధం జరిగింది. అందులో దేవతల ధాటికి ఆగలేక రాక్షసులు తమ గురువైన శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి “గురుదేవా ! మాబాధలు చూడండి. దేవతలు మవమ్మల్ని చావకొట్టారు. మహామంత్రవేత్తవు.
దివ్యమహిమోపేతుడవు మాకులగురువువు. నువ్వు మాట్లాడకుండా ఉంటే ఇంక మేం బ్రతకలేము. మమ్మల్ని రక్షించే భారం నీదే” అన్నారు.
ఆ మాటలు విన్న శుక్రుడు. “నాయనలారా ! దేవతలకు విష్ణుమూర్తి యొక్క అండ ఉన్నది. అతడు సామాన్యుడు కాదు. మాయోపాయాలు బాగా తెలిసినవాడు. అందుచేతనే ప్రతిసారీ దేవతలు జయిస్తున్నారు. అతడికి ప్రతిగా నిలవాలంటే శివుని అనుగ్రహం కావాలి. నేను వెళ్ళి పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాను. అంతవరకు మీరు దేవతలతో యుద్ధానికి పోకుండా, శాంతంగా ఉండండి”. అని చెప్పి తాను తపస్సు చెయ్యటానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు.
రాక్షసులంతా దండకమండలాలు ధరించి, తపస్సు చేస్తున్నట్లుగా కూర్చుని, ఇంద్రుడికి ప్రహ్లాదుడితో శాంతి సందేశం పంపారు. వచ్చింది భక్తశిఖామణి ప్రహ్లాదుడు కాబట్టి దేవతలు అతని మాట నమ్మారు.
శుక్రుని తపోవృత్తాంతము, రాక్షసుల కపటనాటకము చారులవల్ల విన్న ఇంద్రుడు, తన సేనలతో దండెత్తి వచ్చి రాక్షసులను చావబాదటం మొదలుపెట్టాడు. రాక్షసులు దిక్కుతోచక పారిపోతూ భృగుమహర్షి ఆశ్రమం చేరారు. భృగువు, అతని కుమారుడు శుక్రుడు కూడా తపోదీక్షలోనే ఉన్నారు. ఆశ్రమంలో భృగుపత్ని మాత్రమే ఉంది. రాక్షసులు ఆమెను శరణువేడారు. అభయమిచ్చింది భృగుపత్ని రాక్షసులను తరుముకుంటూ ఇంద్రుడు భృగు ఆశ్రమం చేరాడు. లోనికి ప్రవేశించాడు. దేవతలను అడ్డగించింది భృగుపత్నిఆగలేదు ఇంద్రుడు. దాంతో కోపగించి సమ్మోహనాస్త్రం ప్రయోగించింది. దాని ధాటికి దేవతలంతా మోహంలో పడిపోయారు.
ఇంద్రుడు మాత్రం వెనుతిరిగి చూడకుండా పారిపోయాడు. వెంటపడింది సమ్మోహనాస్త్రం. చేసేదిలేక విష్ణువును శరణుజొచ్చాడు ఇంద్రుడు. అభయమిచ్చాడు విష్ణువు.
అస్త్రం సమీపించింది. ఆగమన్నాడు విష్ణువు. అస్త్రం ఆగలేదు సరికదా ఇంద్రుణ్ణి వదలకపోతే అతనితోపాటు నీ సంగతి కూడా చూస్తాను అన్నది. దాంతో కోపించినవాడై చక్రాయుధాన్ని ప్రయోగించాడు విష్ణువు. అది సమ్మోహనాస్రాన్ని నాశనంచేసి, దాన్ని ప్రయోగించిన భృగుపత్నిని కూడా సంహరించింది.
అది చూసిన రాక్షసులు భృగుమహర్షికి విషయం నివేదించారు. ఆఘమేఘాలమీద ఆశ్రమంచేరాడు మహర్షి రక్తపుమడుగులో చచ్చిపడి ఉన్న తన భార్యను చూశాడు. అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది. ఆ కోపంలో తన భార్య మరణానికి కారణమైన విష్ణుమూర్తిని భూలోకంలో నానాయోనులందు జన్మించమని శపించాడు.
విషయం తెలుసుకున్న విష్ణువు పరిపరివిధాల దుఃఖించసాగాడు. పుణ్యానికిపోతే పాపమెదురైనట్లుగా ఇంద్రుణ్ణి రక్షించటానికిపోతే ఈ శాపం తగులుకుంది. ఎంచెయ్యటమా? అని విచారిస్తున్నాడు.
ఆ సమయంలో పరమేశ్వరి ప్రత్యక్షమై “ఈ శాపాన్ని నేను వరంగా మారుస్తున్నాను. విచారించకు. భూలోకంలో ఎప్పుడైతే అధర్మం పెచ్చు మీరుతుందో, అప్పుడు నువ్వు భూలోకంలో జన్మించి ధర్మసంస్థాపన చేస్తావు”. అని చెప్పింది. ఆ రకంగా వచ్చినవే దశావతారాలు. కాబట్టి విష్ణుమూర్తి కూడా పరమేశ్వరి అనుగ్రహంవల్లనే దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తున్నాడు. ధర్మసంస్థాపనకావిస్తున్నాడు.
అయితే అతనికి కూడా సాధ్యంకాని సమయాలలో సాక్షాత్తూ ఆ పరమేశ్వరియే ఈ లోకంలో ఆవిర్భవించి దుష్టశిక్షణగావిస్తుంది. సప్తశతిలోని 11వ అధ్యాయంలో దేవతలు పరమేశ్వరిని శుత్రునాశనం చేసి మమ్ములను రక్షించవలసినది అని వేడుకుంటారు. అప్పుడు 41 నుంచి 54 శ్లోకాల వరకు తాను దేవతలను ఏ రకంగా రక్షిస్తాను అనే విషయం చెప్పి చివరకు
ఇత్థం యదాయదాబాధా దానవోత్థా భవిష్యతి |
తదా తదావతీల ర్యాహం కరిష్యా మ్యరిసంక్షయమ్ ॥
ఎప్పుడైతే దానవులవల్ల దేవతలకు బాధ కలుగుతుందో, అప్పుడు నేను ఆవిర్భవించి రాక్షససంహారం చేస్తాను అంటుంది.
రాక్షసులలో ముఖ్యమైనవారు 1. మహిషాసురుడు 2. భండాసురుడు.
భండాసురుడు దేవతలను హింసిస్తున్నాడు. యజ్ఞయాగాదులు నాశనం చేస్తున్నాడు. దేవతలంతా పరమేశ్వరికి మొరపెట్టుకున్నారు. తమని రక్షించమని వేడుకున్నారు. అప్పుడు భండాసుర సంహారానికి తన సేనతో వ్యూహం నిర్మించింది.
భండ అంటే సిగ్గులేనివాడు. అజ్ఞాని సుఖదుఃఖాలలో మునిగితేలుతుండేవాడు. అతడే దేహి. అటువంటి అ జ్ఞానాన్ని పటాపంచలు చెయ్యటమే భండాసురవధ.
ఈ శరీరమే నేను అనే అజ్ఞానభావన. అదే అసురతాసూచకము. ఈ విషయం ఉపనిషత్తులలో కూడా చెప్పబడింది. ఛాందోగ్యోపనిషత్తులో ఈ విధంగా ఉంది.
పూర్వకాలంలో ఒకసారి ప్రజాపతి ఆత్మతత్వాన్ని గురించి ఒక ప్రకటన చేశాడు.
“ఆత్మకు పాపం అంటదు. ముసలితనం రాదు. మృత్యువు దాన్ని కబళించలేదు. శోకం తాకదు. దానికి ఆకలి దప్పికలులేవు. మానవుడు సత్యకాముడు, సత్యసంకల్పుడు అయి ఆత్మజిజ్ఞాసను అలవరచుకోవాలి. ఆత్మను గురించి తెలుసుకున్నవాడు ఆత్మస్వరూపం పొందుతాడు.”
దేవతలు రాక్షసులు అందరూ ఈ మాటలు విన్నారు. “ఆత్మను గురించి మనం కూడా అన్వేషిద్దాం. ఆత్మవల్ల కోరికలు తీరతాయని బ్రహ్మచెప్పాడుకదా ?” అని వారు భావించారు. దేవతలరాజు ఇంద్రుడు, రాక్షసులరాజు విరోచనుడు ఇద్దరూ ఆత్మజ్ఞానసముపార్టన కోసం బ్రహ్మవద్దకు వెళ్ళారు. బ్రహ్మవీరిద్దరినీ 82 సంవత్సరాలు బ్రహ్మచర్యదీక్ష వహించమన్నాడు. దీక్ష పూర్తిచేశారిద్దరూ. అప్పుడు వారిని చూసి
“వత్సలారా ! మీరు నా కోసం దేనికి వచ్చారు ?” అన్నాడు బ్రహ్మ.
“ప్రజాపతీ ! ఆత్మతత్వాన్ని గురించి నువ్వు చెప్పిన మాటలు విన్నాం. ఆత్మను గురించి తెలుసుకోవాలని వచ్చాం”. అన్నారు ఇంద్ర విరోచనులు.
“మనుష్యుల కనుపాపలలో మెదులుతూ కనిపించే పురుషుడే ఆత్మ, ఆత్మ అభయం. అమృతమయం, అదే బ్రహ్మము” అన్నాడు ప్రజాపతి.
ఆ మాటలు విన్న ఇంద్ర విరోచనులు “భగవాన్ ! నీటిలో కనిపించే ప్రతిబింబము, అద్దంలో కనిపించే ప్రతిబింబము. ఈ రెంటిలో ఏది ఆత్మరూపం?” అని అడిగారు.
“నేను మొదటగా కళ్ళలో మెరిసే ఏ పురుషుని వర్ణన చేశానో, అతడే వీటన్నింటి లోనూ ప్రతిఫలిస్తాడు. ఒకసారి నీళ్ళలోను, అద్దంలోను మీ రూపాలు చూసుకుని మీ అనుభవాలు నాకు చెప్పండి” అన్నాడు బ్రహ్మ. ఇంద్ర విరోచనులిద్దరూ అలాగే చేసి ప్రజాపతి దగ్గరకు వెళ్ళారు. ప్రజాపతి వీరిని చూసి “మీరు ఏం చూశారు?” అన్నాడు.
“నఖశిఖ పర్యంతం కేశపాశాలతో మా శరీరాల ప్రతిరూపమే మాకు నీళ్ళలోను, అద్దంలోనూ కూడా కనిపించింది” అన్నారు వారు.
“నాయనలారా శరీరం శుభ్రపరచుకుని మంచి వస్త్రాలు ఆభరణాలు ధరించి నీటిలో మీ ముఖాన్ని చూసుకుని నాకు చెప్పండి” అన్నాడు బ్రహ్మ. మరునాడు తిరిగివచ్చి “స్వామీ ! చక్కని వస్త్రాలతో ఆభరణాలతో అలంకరించిన మా శరీరాలే నీటిలో కనిపించాయి.” అన్నారు.
“అభయమూ, అమృతమయమూ అయిన ఆత్మ అదే. అదే బ్రహ్మము” అన్నడు ప్రజాపతి.
అదివిన్న ఇంద్రవిరోచనులు ఆత్మను గురించి తమకు పూర్తిగా తెలిసింది అనుకుని తిరిగి వెళ్ళిపోయారు. అలా వెడుతున్న వారిని చూసి “ఆత్మను గురించి పూర్తిగా తెలుసుకోకుండానే వారు వెళ్ళిపోతున్నారు. శరీరమే ఆత్మ అని భావించటం పతనహేతువు” అనుకున్నాడు బ్రహ్మ.
రాక్షసరాజైన విరోచనుడు ఈ సిద్ధాంతంతో తృప్తి చెంది శరీరమే ఆత్మ అని ప్రచారం చేశాడు. కాని ఇంద్రుడు మాత్రం ఇది నమ్మక మళ్ళీ తిరిగి బ్రహ్మ వద్దకు వచ్చి ఆత్మతత్వ్వాన్ని గురించి తెలుసుకున్నాడు.
ఈ రకంగా శరీరమే ఆత్మ అనుకోవటం. అసురతాభావన. ఆత్మస్వరూపిణి పరమేశ్వరియే.
అరిషడ్వర్గాన్ని, శరీరాభిమానాన్ని నాశనం చేసి మోక్షాన్ని ప్రసాదించటమే భండాసురవధ.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below