శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0056 నామం : శ్రీమన్నగర నాయికా
"ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమన్నగరనాయికాయై నమః"
భాష్యం
శ్రీ అంటే లక్ష్మి. శ్రీ అంటే సంపద. శ్రీనగరము లక్ష్మీనగరము. సంపదలకు నిలయమైన నగరము. సంపద్యుక్తమైన నగరానికి నాయిక లేదా ప్రభ్వి ఆ దేవి. రుద్రయామళంలో అనేక కోటి బ్రహ్మాండ కోటీనాం బహి రూర్ధ్వతః
సహస్రకోటి విస్తీర్ణే సుధాసింధో స్తు మధ్యమే
రత్నద్వీపే జగద్వ్వీపే శతకోటి ప్రవిస్తరే
పంచవింశతితత్వాత్మ పంచవింశతివప్రకైః
త్రిలక్షయోజనోత్తుంగైః శ్రీవిద్యాయాః పురమ్ పరమ్ ॥
అనేకకోట్ల బ్రహ్మాండాలకు పైన వేయికోట్ల విస్తీర్ణముగలిగి, ఇరవైబదుతత్వాల స్వరూపమై మూడులక్షల ఆమడల ఎత్తు గలిగి 25 ప్రాకారములుగల శ్రీ విద్యాపురము సుధాసముద్రము మధ్యలో రత్న ద్వీపమునందున్నది.
ఈ శ్రీనగరము రెండువిధాలుగా ఉన్నది.
1. మేరుపర్వతము మధ్యన ఉన్నది.
2. సకలబ్రహ్మాండాలకు బయట, క్షీరసాగరంలో రత్నద్వీపము మధ్యన ఉన్నది.
లలితాస్తవరత్నములో శ్రీనగరాన్ని గురించి చెబుతూ
తత్ర చతుశృతయోజన పరిణామం దేవశిల్పినా రచితం
నానాసాలమనోజ్ఞం నమా మ్యహం నగర మాదివిద్యయాః
అక్కడ 400 ఆమడల పరిమాణము గలిగి, దేవశిల్పిచే కట్టబడినది, అనేక ప్రాకారములచే మనోజ్ఞమైన ఆదివిద్యానగరానికి నమస్కరింతును.
భువనేశ్వరీదేవి నివసించు ప్రదేశమే మణిద్వీపము. అదే శ్రీనగరము అనబడుతోంది.
సుబాలోపనిషత్తులో బ్రహ్మలోకముపైన సర్వలోకమున్నది. అందులో ఈ మణిద్వీపమున్నది. అని చెప్పబడింది. అన్ని లోకాలకు పైభాగాన ఉండటంచేతనే దీనికి సర్వలోకమని పేరు వచ్చింది. పరమేశ్వరి సంకల్పంచేతనే ఇది ఏర్పడింది.
శివరహస్యపురాణంలో శివుడే ఈ లోకాన్ని నిర్మించినట్లున్నది. “ఓ పరమేశ్వరా ! అన్నిటికన్న సుందరము, ఆనందామృతసాగరము, అక్కడ ఉండే వారికి ఆకలి దప్పికలు లేనటువంటిది, కైలాసముకన్న సుందరమైనది అయిన లోకము నాకోసం నిర్మించి ఇవ్వవలసినది” అని దేవి అడుగగా పరమేశ్వరుడే ఈ లోకాన్ని నిర్మించాడు.
బ్రహ్మాండపురాణంలోని లలితోపాఖ్యానంలో దేవి యొక్క అనుజ్ఞతో విశ్వకర్మ ఈ నగరాన్ని నిర్మించాడు అని చెప్పబడింది.
తత్రశ్రీభువనేశానీ పరాశక్తి ర్విరాజితే
బ్రహ్మాలోకాధికాలోకః సర్వలోకాదిభిః పరః
బ్రహ్మలోకం కన్న అధికమైనది, సర్వలోకం కన్న గొప్పదైనది అయిన మణిద్వీప మందు భువనేశ్వరి నివసిస్తున్నది.
దేవీభాగవతంలోని 12వ స్కంధములోని 10వ అధ్యాయంలో వర్ణించటం జరిగింది.
బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోఐ స్తి యఃశ్రుతిః |
మణిద్వీపఃసఏవాస్తి యత్రదేవీ విరాజతే |
ధ్యాయంలో మణిద్వీపాన్ని
బ్రహ్మలోకానికి పైభాగాన సర్వలోకమున్నది. దానినే మణిద్వీపము అంటారు. అన్ని లోకాలకన్న ఇది గొప్పది. కాబట్టి దీన్ని సర్వలోకము అంటారు.
కైలాసా దధికో లోకో వైకుంఠాదపి చోత్తమః
గోలోకా దపి సర్వస్మాత్సర్వలోకోఐ ధికః స్మృతః ॥
నతత్సమం త్రిలోక్యాంతు సుందరం విద్యతే క్వచిత్ ॥
ఛత్రీభూతం త్రిజగతో భవసం తాపనాశకమ్ |
ఛాయాభూతం త దేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమ ॥
అది కైలాసము కన్న మిన్న, వైకుంఠముకన్న ఉత్తమము. గోలోకముకన్న శ్రేష్టము. అందుకే దాన్ని సర్వలోకము అంటారు. ముల్లోకాలలోను దానిని మించిన సుందరమైన నగరము ఇంకొకటి లేదు. అది ముల్లోకాలకు గొడుగు వంటిది. సంసారతాపాన్ని నశింపచేస్తుంది. బ్రహ్మాండాలన్నింటికీ చల్లని నీడనిస్తుంది.
మణిద్వీపానికి నాలుగువైపులా క్షీరసాగరమున్నది. ఆ సాగరంలో గాలికి ఉవ్వెత్తున లేచిన కెరటాలు, రతనాల ఇసుకప్రదేశాలు దక్షిణావృతశంఖాలు, రంగురంగులచేపలు ఉన్నాయి.
లలితాస్తవరత్నము, రుద్రయామళము, శ్రీవిద్యారత్నభాష్యములలో చెప్పినట్లుగా మణిద్వీపానికి 25 ప్రాకారాలున్నాయి. రెండు ప్రాకారాలు మధ్యన ఉన్న ప్రదేశాన్ని ఆవరణ అంటారు. అవి.
1. ఇనుపప్రాకారము. 9. పుష్యరాగప్రాకారము 17. పగడప్రాకారము.
2. కంచుప్రాకారము. 10. పద్మరాగప్రాకారము 18. మాణిక్యరత్న ప్రాకారము
3. రాగిప్రాకారము 11. గోమేదికప్రాకారము 19. సహస్రస్తంభమంటపము
4. సీసప్రాకారము 12. వజ్రప్రాకారము 20. మనస్సాలము
5. ఇత్తడిప్రాకారము 13. వైడూర్య ప్రాకారము 21. బుద్ధిసాలము
6. పంచలోహప్రాకారము 14. ఇంద్రనీలప్రాకారము. 22. అహంకారసాలము
7. వెండిప్రాకారము 15. ముత్యాలప్రాకారము. 23. సూర్యబింబసాలము
8. బంగారుప్రాకారము 16. మరకతప్రాకారము 24. చంద్రబింబసాలము
25. శృంగారసాలము
రెండు ప్రాకార మధ్యభాగాన్ని ఆవరణ అంటారు. అటువంటివి 24 ఆవరణలుంటాయి.
1. మొదటి ఆవరణలో పూలు కాయలతో ఉన్న చెట్లు మంచి నీటిదొరువులు ఉంటాయి. ఈ ప్రాకారానికి 4 ద్వారాలుంటాయి. దేవి దర్శనం కోసం వచ్చిన దేవతల గంధర్వులవాహనాలు అక్కడ బారులుతీరి ఉంటాయి.
2. ఈ ఆవరణలో పండ్లతోటలు, పూలతోటలు ఉంటాయి. కోకిలారావములతోను, బ్రమరముల రూుంకారములతోను ఈ ఆవరణ ప్రతిధ్వనిస్తుంటుంది.
3. ఆవరణలో సుగంధద్రవ్యాలు వెదజల్లే చెట్లుంటాయి. ఇక్కడి వృక్షాలు బంగారు రంగుపూలతో, చిగురాకులతో, రతనాల బీజాలు గల ఫలాలతో ఉంటాయి. ఇక్కడ వసంతుడు పుష్పాసనం మీద కూర్చుని ఉంటాడు. అతనికి మధుశ్రీ, మాధవశ్రీ అని ఇద్దరు భార్యలుంటారు.
4. ఈ ప్రాకారంలో సంతానవృక్షవాటిక ఉన్నది. ఈ ప్రాకారానికి అధిపతి గ్రీష్మరాజు. అతడికి శుకశ్రీ, శుచిశ్రీ అని ఇద్దరు భార్యలు.
5. ఈ ప్రాకారంలో హరిచందన వనం ఉంటుంది. ఈ ప్రాకారానికి అధిపతి వర్షబుతువు. అతడికి 12మంది భార్యలుంటారు.
6. ఈ ప్రాకారంలో మందారవృక్షాలవనం ఉంటుంది. దీనికి ప్రభువు శరదృతువు.
ఇతనికి ఇష్టలక్ష్మి, ఊర్దలక్ష్మి అని ఇద్దరు భార్యలు.
7. ఈ ప్రాకారంలో పారిజాతవనమున్నది. ఈ ప్రాకారానికి రాజు హేమంతుడు. అతనికి సహశ్రీ, సహ్యశ్రీ అని ఇద్దరు భార్యలు. దేవీప్రతము ఆచరించే సిద్ధులు ఇక్కడ ఉంటారు.
8. ఈ ప్రాకారంలో కదంబవృక్షాలుంటాయి. దీని ఏలికశిశిరబుతువు, తపరశ్రీ, తపస్యశ్రీ అని ఇద్దరు అతని భార్యలు. ఇక్కడ సిద్ధులు నివసిస్తారు.
9. ఈ ప్రాకారం ఎర్రని పుష్యరాగాలకాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఇక్కడ నేల, వనాలు అన్నీ ఎరుపురంగులోనే ఉంటాయి. ఇక్కడ ఎనిమిది దిక్కులయందు ఇంద్రాది దేవతలుంటారు.
10. ఇది పద్మరాగాల ప్రాకారము. ఇక్కడి నేల నింగి అంతా ఎర్రగానే ఉంటుంది. ఈ ప్రాకారంలో చతుష్పష్టికళలూ శక్తిస్వరూపాలై ఉంటాయి.
11. ఇది గోమేదిక ప్రాకారము. ఇక్కడి భూమి, వస్తువులు గోమేదికాలలాగా మెరుస్తూ ఉంటాయి. ఇక్కడ విద్య మొదలైన 32 శక్తులు పిశాచముఖాలు కలిగి సర్వదా యుద్ధానికి సిద్ధమై ఉంటాయి.
12. ఇది వజ్రాల ప్రాకారము. ఇక్కడి నేల, వీధులు, సందులు, గొందులు అన్నీ వజ్రాలమయమే. ఇక్కడ పరమేశ్వరి దాసదాసీజనముంటారు.
13. ఇది వైడూర్య ప్రాకారము. ఈ ప్రాంతమంతా వైడూర్యమయం. ఇక్కడ బ్రహ్మీ మొదలైన అష్టమాతృకలుంటారు. ఇక్కడ దేవివాహనాలు నిత్యమూ అలంకరించబడి సిద్ధంగా ఉంటాయి.
14. ఇది ఇంద్రనీలమణి ప్రాకారము. ఈ ప్రాంతమంతా ఇంద్రనీలకాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఇక్కడ 16దళాలు గల మహాపద్మము ఒకటి ఉన్నది. దాని దళాలయందు నల్లనిరంగుతో ఆయుధాలు ధరించిన శక్తులు ఉంటాయి.
15. ఇది ముత్యాలప్రాకారము. ఈ ప్రాంతమంతా ముత్యాలవలె కళకళలాడుతుంటుంది. ఇక్కడ 8 దళాలు గల పద్మమున్నది. ఆ దళాలలో పరమేశ్వరితో సమానమైన పరాక్రమము, సౌందర్యము, పాండిత్యము గల మంత్రిణిలుంటారు.
16. ఇది మరకత ప్రాకారము. ఇది భోగభాగ్యాలకు ఉనికిపట్టు. ఇక్కడ ఆరుకోణాలు గల పద్మమున్నది. ఆ కోణాలలో
1 తూర్పుకోణంలో - గాయత్రితో కూడిన బ్రహ్మ ఉంటాడు. వీరు వేదములు, స్మృతి, పురాణాల రూపంలో ఉంటారు.
2. నైరుతికోణంలో - సావిత్రి, విష్ణువు, శంఖము, చక్రము, గద ధరించి ఉంటారు.
3. వాయుకోణంలో - పరశువు, అక్షమాల, అభయ వరదముద్రలు ధరించిన రుద్రుడు, సరస్వతి ఉంటారు.
4. ఆగ్నేయకోణంలో - రత్బకుంభము, మణికరండకము చేతులందు ధరించి లక్ష్మీసహితుడైన కుబేరుడుంటాడు.
5. వారుణకోణంలో - రతితోకూడిన మన్మథుడు ఉంటాడు.
6. ఆశానకోణంలో - పుష్టిసమన్వితుడైన వినాయకుడు పాశాంకుశాలు ధరించి
17. ఇది పగడప్రాకారము. ఇక్కడి భవనాలన్నీ పగడాలలాగా మెరుస్తుంటాయి. ఈ ప్రాకారంలో పంచభూతాల మీద అధికారంగల శక్తులు ఐదుంటాయి.
18. ఇది రత్నప్రాకారము. ఇక్కడ ఆమ్నాయదేవతలు, దశమహావిద్యలు, సప్తకోటిమంత్రాలు ఉంటాయి.
19. ఇది సహస్రస్తంభమంటపాలుండే ప్రాకారము
20. ఇది మనస్సాలము. ఇక్కడ అమృతేశ్వరి ఉంటుంది.
21. ఈ ఆవరణలో కురుకుల్లాంబ ఉంటుంది.
22. ఇక్కడ చతుష్మతీ, ఛాయాదేవి సమేతుడై మార్తాండభైరవుడుంటాడు.
23. ఈ ఆవరణలో నక్షత్రాలతో కూడిన చంద్రుడుంటాడు.
24. ఈ ఆవరణలో శృంగారశక్తి సహితుడైన మన్మథుడుంటాడు. దీని మధ్యలోనే చింతామణిగృహం ఉంటుంది. దీనికి
ఆగ్నేయభాగంలో - దేవి ఆవిర్భవించిన చిదగ్నికుండము. నైరుతిదిశలో - శ్రీచక్రరథము
వాయువ్యదిశలో - గేయచక్రరథము. అందులో మంత్రిణిశ్యామల ఈశాన్యదిశలో - కిరి చక్రరథము. అందులో దండనాయికవారాహి ఉంటారు.
చింతామణి గృహనికి నాలుగుద్వారాలుంటాయి. ఆ ద్వారాలలో ఆమ్నాయదేవతలుంటారు. అందుకే పీఠపూజ చేసేటప్పుడు
ప్రాగామ్నాయమయా ప్రాగ్హ్వారే ద్వారశ్రీయ్ నమః
దక్షిణామ్నాయమయా దక్షిణ ద్వారే ద్వారశ్రీయై నమః
పశ్చిమామ్నాయమయా పశ్చిమద్వారే ద్వారశ్రీయై నమః
ఉత్తరామ్నాయమయా ఉత్తరద్వారే ద్వారశ్రీయై నమః
తన్మధ్యే క్షీరసాగరాయ నమః
క్షీరసాగరమధ్యే రత్నద్వీపాయ నమః
తన్మధ్యే కల్పవృక్ష వాటికాయై నమః
తన్మధ్యే రత్న సింహాసనాయ నమః
రత్నసింహాసనోపరిస్థితాయైశ్రీ లలితాపరాభట్టారికాయై నమః ఇతి యోని ముద్రాం ప్రణమేత్.
ఆ నాలుగు ద్వారాల మధ్యనా త్రికోణాకారమంచము మీద భువనేశ్వరుని వామాంకం మీద దేవి ఉంటుంది. ఇదంతా శ్రీనగరము. ఈ నగరానికి ఆ పరమేశ్వరినాయిక. అందుకే ఆమె శ్రీమన్నగరనాయిక అయింది.
శ్రీనగరానికి 25 ప్రాకారాలున్నాయి. ఇవి తత్వాలు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచభూతాలు 5, తన్మాత్రలు 5, మనస్సు 1, మాయ, శుద్ధవిద్య, మహేశ్వరుడు, సదాశివుడు. ఇక్కడ 26వ తత్త్వమే పరమేశ్వరి.
గౌడపాదులవారి వ్యాఖ్యలో శ్రీచక్రమే శ్రీనగరము అన్నారు. కాబట్టి శ్రీచక్రంలో ఉన్న 25 తత్వాలే శ్రీనగరంలోని ప్రాకారాలు.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below