శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0053 నామం : శివ
"ఓం ఐం హ్రీం శ్రీం శివాయై నమః"
భాష్యం
వశ కాంతౌ శివః స్మృతః శివుడు అంటే కాంతి, వశము అని అర్థము. కాంతి అంటే ఇచ్చ, కోరిక. పరమేశ్వరుని ఇచ్చారూపమే పరమేశ్వరి. ఆ రకంగా ఇచ్చారూపమైన శక్తికి ఆధారము శివుడు. కాబట్టి శివశక్తులకు భేదం లేదు. శైవాగమాలప్రకారము మనః ప్రవృత్తులకు సాక్షీభూతుడు, ఆ ప్రవృత్తుల ఆవిర్భావానికి ముందున్నవాడు. ప్రవృత్తులలో ఉన్నవాడు. చిత్తవృత్తులకు కారకుడు,
సత్యము, నిత్యము, చిద్రూపి అయినవాడు, అన్నింటికీ కారణము ఎవరో అతడే శివుడు.
జీవ ఈశత్వాదులు లేనివాడు. లోకాలకు మేలు కలిగించేవాడు శివుడు. అతడే పరమేశ్వరుడు. ఆ లక్షణాలన్నీ దేవి యందున్నాయి కాబట్టి ఆమె శివా అని పిలువబడు తున్నది. మంగళకరమైన గుణాలన్నీ ఆమెలో ఉన్నాయి. అందుకే ఆమె శివా అనబడింది.
అన్నిటికీ మూలమైనవాడు శివుడు. విశ్వమంతా అతనిలో లీనమైఉన్నది. అతడు పరిశుద్ధుడు. నిర్మల గుణసంపన్నుడు. కైవల్యోపనిషత్తులో త్రిలోచనుడు, నీలకంఠుడు, ప్రశాంతుడు శివుడని చెప్పబడింది. లోకాలకు ఆధారభూతుడు, భక్తులకు అమృతత్వాన్ని పంచిపెట్టేవాడు శివుడు. శివాశివులకు భేదంలేదు. లింగపురాణంలో యథా శివ స్తథా దేవీ యథాదేవీ తథాశివః అని చెప్పబడింది. శివుడు ఎలా ఉంటే దేవి కూడా అలానే ఉంటుంది. దేవి ఎలా ఉంటే శివుడు అలానే ఉంటాడు. ఆ ఇద్దరికీ భేదంలేదు.
ఉమాశంకరయో ర్ఫేదో నాస్త్యేవ పరమార్థతః
ద్విధాసౌ రూప మాస్థాయ స్థిత ఏకో న సంశయః
ఉమాశంకరులకు భేదం లేదు. రూపాలు వేరుగా కనిపించినా అది ఒకటే.
మానసోల్లాసము అనే గ్రంథంలో చెప్పినట్లుగా
యేల పి బ్రహ్మాదయో దేవా భవన్తి వరదాయినః
త్వద్రూపం శక్తి మాసాద్య తే భవన్తి వరప్రదః ।
తస్మాత్ త్వ మేవ సర్వత్ర కర్మణాం ఫలదాయినీ ॥
శక్తి లేకుండా శివుడు ఉండడు. కాబట్టి శక్తికీ శక్తిమంతుడైన శివునకూ భేదం లేదు.
పరమాత్మా శివః ప్రోక్తః శివా సైవ ప్రకీర్తితా
పరమాత్మే శివుడు. అతడే శివా అని పిలువబడుతున్నాడు. పరిమళ అనే గ్రంథంలో చెప్పినట్లుగా
అలేఖ్య విశేష ఇవ గజవృషభయోర్హయోః ప్రతిభాసమ్
ఏకస్మిన్నే వార్థే శివశక్తి విభాగకల్పకాం కుర్మః ॥
ఒకే బొమ్మను చూసి కొందరు ఏనుగు అని, మరికొందరు ఎద్దు అని భావించినట్లే, ఒకే బ్రహ్మను కొందరు శివుడని, కొందరు శక్తి అని భావిస్తున్నారు. దేవీపురాణంలో
శివాముక్తి స్సమాఖ్యాతా యోగినాం మోక్షదాయినీ
శివాయ జయతే దేవీ తతోలోకే శివాస్మృతా ॥
శివా అను ఆమె ముక్తినిస్తుంది. యోగులకు మోక్షాన్నిస్తుంది. లోకాలకు మేలు కలుగచేస్తుంది. ఆగమాలలో చెప్పినట్లు అగ్నికి వేడిలాగా, సూర్యునికి కాంతిలాగా, పరమేశ్వరునికి దేవి సహజమైనది.
నిరాకారుడు నిర్లుణస్వరూపుడు అయిన పరబ్రహ్మలోకాలను సృష్టించాలనే ఉద్దేశ్యంతో తనలో నుంచి కొంతశక్తిని బయటకు పంపాడు. అతడు ప్రకాశాంశ కాగా బయటకు వచ్చిన శక్తి విమర్శాంశ. వారే శివశక్తులు. వారిద్దరూ ఒకటే. వేరుకాదు. శ్రీచక్రంలోని త్రికోణము శక్తిస్వరూపము బిందువు శివ స్వరూపము.
త్రికోణరూపిణీశక్తిః బిందురూప పరశ్శివః
శివశక్తులు ఎప్పుడూ విడివిడిగా ఉండవు. ఆ రెండూ కలిసే ఉంటాయి. అందుకే శ్రీచక్రంలో
త్రికోణే బైందవమ్శ్లిష్టమ్.
త్రికోణంలో బిందువుంటుంది అని చెప్పబడింది.
శివుడు, శక్తి కలిసే శివా అనబడుతోంది. ప్రకాశ విమర్శత్మకము, జ్ఞానాత్మకము, మాయాతీతమైన చిద్రూపము శివాస్వరూపమనబడుతుంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below