శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0046 నామం : శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజ
"ఓం ఐం హ్రీం శ్రీం శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజాయై నమః"
భాష్యం
మంజీరములు అనేవి స్త్రీల కాళ్ళకు ఉండే ఒక రకమైన ఆభరణము. అందెలు, పట్టాలు, పాంజేబులు, గొలుసులు, కడియాలు, మంజీరములు అనేవి కాళ్ళకు పెట్టుకునే రకరకాల ఆభరణాలు. వీటిలో మంజీరాలు రాళ్ళు పొదగబడి ఉంటాయి. పరమేశ్వరి ధరించిన ఈ మంజీరాలు మణులు పొదగబడి ఉంటాయి. ఆ మణులకాంతులచేత దేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఈ మంజీరాలకు చిరుమువ్వలు వేలాడుతుంటాయి. నడుస్తున్నప్పుడు ఆ మువ్వలు విచిత్రమైన ధ్వనులు చేస్తుంటాయి. ఆ ధ్వని ప్రణవాన్ని మరపింప చేస్తుంది. వేదాన్ని గుర్తుకు తెస్తుంది.
గజ్జెలతో కూడిన అందెలనే మంజీరాలు అంటారు. పరమేశ్వరి కాళ్ళకు ఉన్న ఈ మంజీరాలు హాది, కాది విద్యలు అని చెప్పబడుతున్నాయి. పంచదశి మహామంత్రాన్ని అనేకమంది అనేక రకాలుగా ఉపాసన చేశారు.
అ నుంచి క్ష వరకు గల అక్షరసమామ్నాయాన్ని “మాతృకలు” అంటారు. వీటిలో కకారముతో మొదలయ్యే అక్షరాలను కాది మాతృకలని, హకారంతో మొదలయ్యే అక్షరాలను హాది మాతృకలని అంటారు. పంచదశి మహామంత్రం కకారంతో మొదలయితే కాదివిద్య, హకారంతో మొదలయితే హాదివిద్య. ఇంద్రుడు, చంద్రుడు, మనువు, కుబేరుడు, మన్మథుడు మొదలైన వారు కాది విద్యనుపాసించగా, లోపాముద్ర సూర్యుడు, శివుడు, విష్ణువు మొదలైనవారు. హాదివిద్యను ఉపాసించారు. హాదివిద్యలో యమనియమాలు ఎక్కువగా ఉంటాయి. కాదివిద్యలో అవి ఎక్కువ ఉండవు. ధర్మాచరణలో స్వేచ్చ ఇవ్వబడింది. అని శక్తి సంగమ తంత్రంలో చెప్పబడింది. ఈ రెండు విద్యలలోను కాదివిద్య శ్రేష్టమైనది.
తేషు ద్వా మనురాజేతు వరిష్టా వింద్య మర్దన
లోపాముద్రా కామరాజానితిఖ్యాతి ముపాగతా
హాది స్తు లోపాముద్రాస్యా త్కామరాజ స్తు కాదికః
తయోస్తు కామరాజోల యం సిద్ధిదో భక్తి శాలినః ॥
హాది విద్యలో లోపాముద్ర ఉపాసించిన మంత్రము కాదివిద్యలో కామరాజు (మన్మధుడు) ఉపాసించిన మంత్రము శ్రేష్టమైనవి. కాగా హాది, కాది విద్యలలో కాదివిద్య శ్రేష్టమైనది.
హాది, కాది విద్యలలో ఏ విద్యనుపాసించినా సాధకుడికి ఇష్టార్ధసిద్ధి కలుగుతుంది. అందుకే దేవి పాదాలకు ఉన్న రెండు మంజీరాలు హాదికాది విద్యలు అని చెప్పబడ్డాయి.
దేవి కాలి అందెలను శంకరభగవత్సాదుల వారు తమ సౌందర్య లహరిలో 86వ శ్లోకంలో వర్ణిస్తూ
మృషా కృత్వా గోత్ర - స్ఖలన మథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం - చరణకమలే తాడయతి తే|
చిరా దంత శ్శల్యం - దహనకృత మున్మూలితవతా
తులాకోటిక్వాణైః - కిలికిలిత మీశానరిపుణా||86||
ప్రణయ కలహ సమయమున దేవి తన కాలితో శివుని లలాటమున తన్నినది. అప్పుడు ఆమె అందెల మోత యెట్లున్నది? తన శత్రువైన శివునికి, పరాభవము కలిగినందుకు, మన్మధుడు కిలకిల నవ్వినట్లున్నది.
తల్లీ! నీ దగ్గర ఉన్నప్పుడు, శివుడు తన్మయత్వంలో పొరపాటున నీ సవతి పేరు ఉచ్చరించాడు. దానికి నీవు కాని కాలితో నుదుటన తన్నవు. గిరిజా కల్యాణానికి ముందు శివుని కోపాగ్నికి భస్మమైన మన్మథుడు, శివుని మీద కోపగించి అదనుకోసం వేచి ఉన్నాడు. ఇప్పుడు అదనుచూసి నీ కాలి అందెలలోని మువ్వలలో చేరి శివుని చూసి హేళన చేస్తూ కిలకిలా రావం చేస్తున్నాడు.
అనగా పరమేశ్వరి కాలి అందెలరవళులు కిలకిలా రావాన్ని మరపిస్తున్నాయి.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below