శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0044 నామం : నఖదీధితిసంఛన్నసమజ్జనతమోగుణ
"ఓం ఐం హ్రీం శ్రీం నఖదీధితిసంఛన్నసమజ్జనతమోగుణాయై నమః"
భాష్యం
నఖదీధితి సంఛన్న సమజ్జన తమోగుణా పాదాభివందనం చేసేవారికి, దేవియొక్క కాలిగోళ్ళ కాంతులచేత అజ్ఞానము పటా పంచలవుతుంది. పరమేశ్వరికి పాదాభివందనం చేసినంతనే అజ్ఞానము తొలగిపోతుంది.
పాదాభివందనము అంటే ఎదిటివారి పాదాలకు సాగిలబడి నమస్కారం చెయ్యటం. పరమేశ్వరికి పాదాభివందనం చేసే వారందరూ దేవతలు. వారందరూ కిరీటధారులు. ఆ కిరీటాలు రత్మమణిమయాలు. చెప్పలేనటువంటి కాంతులు ప్రకాశింపచేస్తూ ఉంటాయి. అటువంటి కిరీటాలు గల దేవతలు వారి శిరస్సులు వంచి పరమేశ్వరికి పాదాభివందనం చేస్తున్నప్పుడు, దేవి కాలిగ్రోళ్ళ నుంచి ప్రసరించే కాంతులు పరమేశ్వరి పాదాలకు నమస్కరిస్తున్న దేవతల కిరీటాలలోని మణులనుంచి వచ్చే కాంతులకన్న ఎన్నో రెట్లు ఎక్కువైనవి. అది గమనించిన వారి యొక్క అజ్ఞానము పటాపంచలయి పోతుంది.
పద్మపురాణంలో నారదుడు హిమవంతుడి దగ్గరకు వచ్చి పార్వతీదేవి యొక్క సాముద్రిక లక్షణాలు వివరిస్తూ
1. ఈమెకు భర్త జన్మించలేదు.
2. ఈమె చేతులు
ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి.
3. ఈమె పాదాలు వ్యభిచరించునవిగా ఉంటాయి.
అని చెబుతాడు ఆ మాటలను తప్పుగా అర్ధం చేసుకున్న హిమవంతుడు దుఃఖిస్తుంటాడు. అప్పుడు నారదుడు తన మాటలు వివరిస్తూ
1. భర్త జనించలేదు అంటే అతడు జనన మరణములు లేనివాడు. ఆద్యంతములు
లేనివాడు అతడే పరమేశ్వరుడు.
2. ఆమె చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి. అంటే ఎప్పుడూ ఆమె ఇచ్చే స్థితిలోనే ఉంటుంది. కాని ఎవరినుంచీ ఏమీ తీసుకోదు. ఇచ్చేవారి చేతులు ఎప్పుడూ పైనే ఉంటాయి.
3. తనకాంతులచే పాదాలు వ్యభిచరిస్తాయి అంటే, స్వచ్చమైన గ్రోళ్ళతో ప్రకాశించే దేవిపాదాలు పద్మములులాగా ఉంటాయి. దేవదానవులు ఆమె పాదాలకు నమస్కరించే టప్పుడు వారి కిరీటములలోని మణులకాంతులు దేవి పాదాలయొక్క వ్రేలిగోళ్ళ కాంతులముందు వెలవెలపోతాయి. వారి అజ్ఞానాన్ని హరించివేస్తాయి. అంటాడు.
ఈ కాంతులే చరాచర జగత్తునూ ప్రకాశింపచేస్తున్నాయి. అగ్ని కిరణములు 108, సూర్య కిరణములు 116, చంద్రుని కిరణములు 136. వెరసి 860 ఇవన్నీ మహావాక్య సూచకాలు. మంత్ర సంకేతాలు.
శంకరభగవత్సాదులవారు తన సౌందర్య లహరిలోని 89వ శ్లోకంలో పరమేశ్వరి నఖాలను వివరిస్తూ
నఖై ర్నా కస్త్రీణాం - కరకమలసంకోచశశిభి
స్తరూణాం దివ్యానాం - హసత ఇవ తే చండి చరణౌ|
ఫలాని స్వస్థ్సేభ్యః - కిసలయకరాగ్రేణ దదతాం
దరిద్రేభ్యో భద్రాం - శ్రియమనిశ మహ్నాయ దదతౌ||89||
చండీమాత పాదములు, బీదలకు భద్రమైన సకలైశ్వర్యములను, ప్రసాదించును. చండీమాత పాదములకు, దేవతలు చేతులు జోడించి, అంజలి ఘటించుచున్నారు. మాత కాలిగోళ్ళనెడు చంద్రుల కాంతికి, ఆదేవతాస్త్రీల, కర పద్మముల ముకుళించుచున్నట్లుగా, అనిపించుచున్నది. ఆ చంద్రులు, స్వర్గములో, (దేవతలకు సంపదలనిచ్చెడు) కల్పవృక్షములను, పరిహసించుచున్నట్లున్నది.
దేవీ! సకల సంపదలతోను తులతూగు దేవతలకు మాత్రమే కోర్కెలు తీర్చు కల్పవృక్షమును, దరిద్రులకు మంగళకరమై అధిక సంపదలనిచ్చు నీ పాదాలు శచీదేవి మొదలైన దేవతా స్త్రీల యొక్క కరపద్మములను ముకిళింప చేయు గోళ్ళను చంద్రులచేత పరిహాసము చేయబడుచున్నాయి.
ఇక్కడ దేవతా స్త్రీలయొక్క చేతులను “కరపద్మములు” అంటూ పద్మాలతో పోల్చారు. పద్మాలు సూర్యకాంతిలోనే వికసించి ఉంటాయి. కాని చంద్రోదయం కాగానే అవి ముకుళించుకుపోతాయి. అలాగే పద్మాలు అనబడే దేవతా స్త్రీలచేతులు చంద్రకాంతిలాగా ఉన్న దేవి కాలివ్రేలి గోళ్ళకాంతులవల్ల ముడుచుకుపోతున్నాయి. వెలవెలబోతున్నాయి.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below