శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0043 నామం : కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా
"ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై నమః"
భాష్యం
తాబేటి వీపును జయించు స్వభావము గల మీగాళ్ళతో కూడినది. అనగా ఆమె మీగాళ్ళు తాబేలు వీపుకన్న బాగా ఉన్నాయి అని అర్ధం.
తాబేలు వీపుమీద సురక్షితంగా ప్రకాశిస్తున్న చతుర్దశ భువనాల రక్షణ కలది. సంగ్రామంలో మరణం పొందకుండా ఉండాలంటే అమృతం తాగాలి అనే నిర్ణయానికి వచ్చారు దేవతలు. అమృతం కావాలి అంటే క్షీరసాగర మధనం జరగాలి. అందుకోసం మందరగిరి పర్వతాన్ని కవ్వంగా తెచ్చుకున్నారు. వాసుకిని త్రాడుగా చేసి దేవదానవులు క్షీరసాగరమధనం ఆరంభించారు. పర్వతం సముద్రంలో మునిగిపోతోంది. ఏం చెయ్యాలో తెలియలేదు. అప్పుడు దేవతలంతా శ్రీమహావిష్ణువును ప్రార్ధించారు. ఆ సమయాన ఆత్రత్రాణ పరాయణుడైన శ్రీమహావిష్ణువు కూర్మరూపంలో మందరగిరి పర్వతాన్ని మోశాడు. ఈ రకంగా జగాలను రక్షించాడు. అందుచేతనే కూర్మము వీపుమీద చతుర్దశ భువనాలకు రక్షణ కల్పించింది అన్నారు.
తాబేలు వీపు చాలా గట్టిగా ఉంటుంది. రాయితో కొట్టినా పగలదు. ప్రమాదం ఏదయినా సంభవించినప్పుడు తాబేలు తనకాళ్ళు, తల వీపు క్రిందికి లాక్కుని రక్షణ కల్పించుకుంటుంది. అటువంటి తాబేటి వీపులాగా పరమేశ్వరి పాదాలున్నాయి. అంటే దేవి పాదాలను ఆశ్రయించిన వారికి తాబేటి చిప్పవలె రక్షణ కల్పిస్తుంది. పాదముయొక్క పైభాగాన్ని 'ప్రపదం” అంటారు. సౌందర్య లహరిలోని 88వ శ్లోకంలో శంకరభగవత్సాదులు దేవి ముంగాలును వర్ణిస్తూ
పదం తే కీర్తీనాం - ప్రపద మపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః - కఠినకమఠీకర్పరతులాం||
కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం - దృషది దయమానేన మనసా ||88||
భావము:
అమ్మా.. నిన్ను ఆశ్రయించిన వారికి, సత్కీర్తులను కలిగించుచు, సకల ఆపదలను తొలగించుచు, మంచికి పుట్టిల్లుగా,చెడులు అనేవి దరిచేరలేని శుభవాకిళ్లుగా వెలుగొందుచుండేవి, నీ పాదముల పైభాగాన ఉండు, నీ మీగాల్లు, అటువంటి నీ పాదమును, నీ వివాహ వేళ, రాతియందు, వధువు పాదము పెట్టించుట అను ఒక తంతుయందు, దయాపూర్ణమైన మనసు కల నీ భర్తయైన శివుడు, తన చేతితో, నీ పాదములు పట్టుకుని, రాతియందు ఉంచుటకు, (వధువుచే సన్నికల్లు తొక్కించుట), చాల సందేహించినాడు.ఎందుకనగా, అతి మృధులమైన, నీ పాదములు, ఆ కఠిన రాతి స్పర్శతో, ఎక్కడ కందిపోవునో అని. మరి అంత సున్నితమైన ఆ సుకుమార పాదాన్ని, ఆ పాదంపై నున్న మీగాలుని (అరికాలు పై భాగం) కొందరు సత్కవులు (లలితలో వశిన్యాది దేవతలు) కఠినంగా ఉండే, ఆడ తాబేలు వీపు చిప్పతో, ఉపమానం చెబుతూ, ఎలా వర్ణించగలిగారమ్మా!
దీనికి తాబేటి చిప్పను జయించినటువంటి ప్రపదం (అరికాలి పై భాగం)తో శోభిల్లుదానా, అని అమ్మను, వశిన్యాది దేవతలు వర్ణించారు. దానినే ఇక్కడ శ్రీ శంకరులు, అంత మృధువైన నీ పాదములను, అలా వర్ణించుట సరికాదని, నిష్కర్షగా చెప్పినారు. ఇక్కడ శ్రీ శంకరులకు, అమ్మమీద ఉన్న, అమిత మాతృభావ లాలిత్య భక్తి, మనకు కనబడుతుంది. నాతల్లి యొక్క అంత మృధుపాదాలు పట్టుకుని, అంత కఠినంగా వర్ణిస్తారా... అసలు ఆ మాట అనడానికి, వారికి (వశిన్యాది దేవతలు) మనసెలావచ్చిందని, ఆదిశంకరులు, కరుణతో విలవిలలాడిపోయారు. అదికదా భక్తి అంటే. అమ్మ మీగాళ్లు అంత మృధువుగా ఉన్నవి.
ఓ దేవీ, భగవతీ! అన్ని వైభవాలకు ఉనికిపట్టై, ఆపదలను తొలగించే నీ పాదాగ్రాలను, సత్కవులు అతికఠినమైన తాబేటి చిప్పతో సరిపోల్చ, ఎలా పూనుకొంటున్నారు? త్రిపురాంతకుడైన పరమ శివుడు, వివాహ సమయంలో, కనికరం గల మానసుడై, ఎంత సున్నితంగా, ఆ పాదాలను సన్నెకల్లు పై పెట్టాడో కదా!.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below