శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0039 నామం : కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా
"ఓం ఐం హ్రీం శ్రీం కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితాయై నమః"
భాష్యం
కామేశ్వరునికి మాత్రమే తెలియదగిన సౌభాగ్యమార్ధవము, లావణ్యము, కోమలములయిన ఊరుద్వయము గలది.
ఈ జగత్తు అంతటికీ అంతర్ బహిసాక్షి, సచ్చిదానందరూప అయిన పరమేశ్వరి భర్త అయిన కామేశ్వరునికి మాత్రమే తెలియదగిన ఊరుద్వయము గలది. “ఊరు” అనే శబ్దంలో ఊ, ఉ అని రెండు అక్షరాలున్నాయి. వీటిలో ఊ అనేది వామోరువు. ఎడమతొడ, సౌభాగ్య సంజ్ఞ కలది. అలాగే ఉ అనేది దక్షిణోరువు, కుడితొడ. మార్చవ సంజ్ఞగలది. ఊరుద్వయము యొక్క సంధిస్థానము రత్నమణి సంజ్ఞ గలిగి తొమ్మిది అంకెచేత సూచించబడుతున్నది. ఇది పరము అపరము అని రెండు విధాలు. వామోరువు పరాసూచితము. దక్షిణోరువు అపరాసూచితము. వామోరువు సృష్టిలోని చతురువర్ణములలోను స్రీ పురుష భేదాలను సూచిస్తుంది. కాగా దక్షిణోరువు పంచ భూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారములను సూచిస్తుంది.
“కామేశ్వరునికి మాత్రమే ఎరుక అయిన లావణ్యము (కాంతి విశేషము) మార్చవము గల ఊరుద్వయము గలది”. అని భాస్కరరాయలవారి వ్యాఖ్య. అంటే దేవియొక్క ఊరువులకాంతి, మృదుత్వము ఆ పరమేశ్వరునికే ఎరుక అని అర్థము. ఈ నామంలో పరమేశ్వరి సతీత్వము, శివశక్త్యిక్యము నిరూపించబడుతున్నాయి.
సౌందర్య లహరిలోని 82వ శ్లోకంలో శంకరభగవత్సాదులవారు దేవి ఊరుద్వయాన్ని వర్ణిస్తూ
కరీన్ర్దాణాం శుండాన్ - కనక కదళీకాండపటిలీం
ముభాభ్యా మూరుభ్యా - ముభయమపి నిర్జిత్య భవతి|
సువృత్తాభ్యాం పత్యుః - ప్రణతికఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే జానుభ్యాం - విబుధకరికుంభద్వయమసి||82||
దేవీ ! ఏనుగు తుండములు, అరటి బోదెలను నీ రెండు ఊరువులచేత జయించి, పరమేశ్వరునికి మొక్కుటచే కఠినమైన మోకాళ్ళు కలిగి ఏనుగుల కుంభస్థలములను కూడా జయించుచున్నావు.
స్త్రీల ఊరువులను అరటి బోదెలతోను, ఏనుగు తుండములతోను పోల్చటం పరిపాటి. ఇక్కడ పరమేశ్వరి వాటిని కూడా జయించింది అనటంచేత, ఆమె ఊరువులముందు అరటిబోదెలు, ఏనుగుతుండములు కూడా సాటిరావు అని భావము.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below