శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0034 నామం : నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ
"ఓం నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయై నమః"
భాష్యం
ఈ నామంలో స్త్రీ శరీరంలో నాభిదగ్గర నుండి వక్షస్థలము వరకు చెప్పబడుతున్నది. నాభినుంచి వక్షమువరకు వ్యాపించిన రోమావళి అనే లతకు ఫలములు స్తనద్వయముగా చెప్పబడింది.
అజ్ఞానాంధకారంతో కప్పబడిన జీవరాశే ఈ రోమావలి. మాయామయమైన జీవి అహంకారంతో లతలాగా విజృంభిస్తాడు. ఆధారం లేని లత ఏ విధంగా నిలబడలేదో అదే విధంగా జీవికూడా నిలబడలేడు. కుప్పకూలిపోతాడు. అటువంటి ఆ జీవిని ఉద్ధరించడానికి జ్ఞానమనే క్షీరము గలిగిన స్తనయుగము ఏర్పడింది. పరమేశ్వరి యొక్క స్తనములు మోహనాకారములు. అవి మాంసపు ముద్దలు కావు. సృష్టిలోని సకల జీవరాసులను ఉద్ధరించటానికి అమృతక్షీరమును దాల్చిన మాతృస్తనములవి.
నాభి అనేది ముఖ్యప్రాణమణి. రోమావళి లత అవ్యక్తమైనది. దీన్ని సుషుమ్నానాడితో పోల్చవచ్చు. ఫలములు అనాహతంలో అంటే హృదయ స్థానంలో రెండువైపులా ఉన్న ఇడ, పింగళనాడులు. దుర్వాసుడు శ్రీదేవీ మహిమ్మః స్తుతిలోని 38వ శ్లోకంలో పరమేశ్వరి స్తనయుగాన్ని కీర్తిస్తూ
కస్తూరీఘనసారకుంకుమరజోగంధోత్మటె శ్చందనై
రాలిప్తం మణిమాలయాల_ తిరుచిరం గ్రైవేయహారాదిభిః |
దీప్తం దివ్య విభూషణై రగణితై ర్జ్యోతి ర్విభాస్వత్కుచ
వ్యాజస్వర్ణ ఘటద్వయం హరిహరబ్రహ్మాదిపీతం భజే ॥
పరమేశ్వరి యొక్కస్తనయుగము కస్తూరి, కుంకుమ, కర్పూరము మొదలైన సుగంధ ద్రవ్యముల లేపనం గావించబడింది. మణిహారములతో అలంకరించబడింది. దివ్య భూషణములతో అలంకరించబడింది. బ్రహ్మాదిదేవతలకు స్తన్యమునిస్తున్నది. శంకర భగవత్సాదులవారు సౌందర్య లహరిలోని 77వ శ్లోకంలో
యదేతత్కాళిందీ - తనుతరతరంగాకృతి శివే
కృశే మధ్యే కించి - జ్జనని తవ యద్భాతి సుధియామ్|
విమర్దా దన్యోన్యం - కుచకలశయో రంతరగతం
తనూభూతం - వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్||77||
దేవి నూగారు వర్ణన - శివాని సన్నని నడుమునందు, యమునానది, సూక్ష్మతరంగములవలె, (అతి చిన్నవైన) రోమావళి యున్నది. ఆమె కుచకుంభముల ఒరిపిడివలన, వాని మధ్యనున్న ఆకాశము (స్థలము) నకు చోటు చాలలేదు. కనుక ఆ యాకాశము క్రిందికి జారి, ఆమె నాభి రంధ్రమున చోటుచేసుకొనెనా, యన్నట్లుగా అనిపించుచున్నది .
ఓ తల్లీ ! నీ స్తనముల మధ్య జరిగిన ఒరిపిడికి నల్లబడి సన్నగా క్రిందికి జారిన లక్కవలె నాభివరకు గల రోమావళి లత కనిపిస్తున్నది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below