శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0032 నామం : రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా
"ఓం రత్నాగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయై నమః"
భాష్యం
రత్నములతో చెక్కబడిన బంగారు కంఠాభరణములు గలది. దీనిలో మువ్వలు వ్రేలాడుతున్న పతకము ఉంటుంది. దాన్నే ప్రస్తుతము మనం డాలరు అంటున్నాం. అదే చింతాకు పతకము. అయితే ఇది పాపిటబొట్టు అని కొందరంటారు. కాని గ్రైవేయము అని చెబుతున్నారు. గ్రీము అంటే మెడ. గ్రైవేయము మెడను ధరించినది కాబట్టి రతనాలు ముత్యాలు బంగారము కలిపి చేయబడిన కంఠాభరణములు గలది.
ఆంధ్రదేశంలో చింతాకుపతకము ప్రసిద్ధి చెందినది. భక్తరామదాసు “సితమ్మ కుచేయిస్తి చింతాకు పతకము” అంటాడు. కంఠస్థానమునందు పరమేశ్వరిని ధ్యానించేవారు గ్రైవేయ చింతాకులు. వీరు మధ్యములు. లౌకిక విషయములయందు ఆసక్తి కలవారు నీచులు. ముక్తికోసం ధ్యానించేవారు ఉత్తములు.
దుర్వాసుడు శ్రీదేవీ మహిమ్మః స్తుతిలోని 34వ శ్లోకంలో పరమేశ్వరి కంఠసీమలోని ఆభరణాలను వర్ణిస్తూ
సంసక్తాః కలయామి హీరమణిమన్ముక్తావలీ కీలిత
గ్రీవా పట్టవిభూషణేన సుభగం కంఠం చ కంబుశ్రియమ్ ॥
ఓ పరమేశ్వరీ ! నీ మెడ శంఖాకారములో ఉన్నది. అటువంటి మెడలో వజ్రములతోను, మంచి ముత్యములతోను కూర్చబడిన పట్టెడ అలంకరించబడి ఉన్నది. సౌందర్య లహరిలోని 74వ శ్లోకంలో శంకరభగవత్సాదులు దేవి మెడలోని హారాలను వర్ణిస్తూ
వహ త్యంబ స్తంబేరమదనుజ కుంభ ప్రకృతిభిః
సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్|
కుచాభోగో బింభాధరరుచిభి రంత శ్శబలితాం
ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే||74||
తల్లీ నీ వక్షస్థలము గజాసురుని సంహరించి అతని కుంభస్థలము నుంచి తెచ్చిన ముత్యములతో చేసిన ఆభరణములతో చిత్రవిచిత్ర కాంతులతో ప్రకాశిస్తున్నది.
ఇక్కడ ఏనుగు కుంభస్థలంలో రత్నాలుంటాయి అని చెబుతున్నారు శంకరులు. ముత్యాలు ఆరు విధాలుగా దొరుకుతాయి.
గజకుంభేషు వంశేషు ఫణాసు జలదేషు చ
శుక్తికాయాం ఇక్షుదండే షోఢా మౌక్తిక సంభవా॥
ఏనుగుల కుంభస్థలము నందు, వెదురుచెట్ల యందు, పాము పడగలయందు, మేఘముల యందు, ముత్యపుచిప్పలయందు, చెరకుగడలందు ముత్యాలు దొరుకుతాయి. ఇవి రకరకాల రంగులు కలిగి ఉంటాయి.
గజకుంభే కర్వ్పూరాభాః వంశే రక్తసితాః స్మృతాః
ఫణాసువాసు కేరవ నీలవర్షాః ప్రకీర్తి తాః ॥
జ్యోతి ర్వర్ణా స్తు జలదే శుక్తికాయాం సితాః స్మృతాః
ఇక్షుదండే పీతవర్షాః మణయో మౌక్తికా స్మృతాః ॥
1. ఏనుగు కుంభస్థలము నందు - చిత్రవిచిత్ర వర్ణములు గలవి
2. వెదురుచెట్ల యందు - తెలుపుతో కూడిన ఎరుపు వన్నె కలవి
3. పాముపడగలయందు గా నీలవర్ణములు
4. మేఘములయందు - మెరుపు వర్ణము గలవి
5. ముత్యపుచిప్పల యందు గ శ్వేతవర్ణము గలవి
6. చెరకుగడ యందు - పసుపు వర్ణము గలవి
పరమేశ్వరి మెడలో వేసిన హారములోని రత్నములు ఏనుగు కుంభస్థలము నుండి తెచ్చినవి. అందుచేతనే అవి చిత్ర విచిత్రకాంతులతో మెరుస్తున్నాయి.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below