శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0030 నామం : కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా
"ఓం కామేశబద్ధమాంగళ్యసూత్రశోభిత కంధరాయై నమః"
భాష్యం
పరమశివునిచే కట్టబడి, మన్మథుడు మళ్ళీ బ్రతకటానికి కారణమై, సౌభాగ్యాభరణమైన మంగళ సూత్రముచే ప్రకాశించు మెడగలది.
వేదంలో మంగళసూత్రం ప్రసక్తి లేదు. అక్కడ పాణిగ్రహణము, సప్తపది మాత్రమే చెప్పబడ్డాయి. కాని కాలానుగుణంగా సంప్రదాయం మారిపోయింది.
మాంగల్యం తంతునాల నేన మమ జీవనహేతునా ।
కంఠే బధ్నామి సుభగే ! త్వం జీవ శరద శృతం ॥
“నా జీవమునకు హేతువైన యీ సూత్రముచేత నేను నీ కంఠమున మాంగల్యమును బద్ధము చేయుచున్నాను. నీవు నూరు సంవత్సరములు జీవించుము” అని చెప్పి మంగళసూత్రధారణ చెయ్యటము వివాహంలో ముఖ్యమైన తంతుగా మారిపోయింది.
ఈ మాంగల్యం - ప్రథమాభరణము
ఇక్కడ శివునిచే కట్టబడిన మాంగల్యముతో శోభించుచున్న కంఠసీమ గలది అని భావన.
ఈ విషయాన్ని శంకరుల వారు తమ సౌందర్య లహరిలోని 69వ శ్లోకంలో
గళే రేఖాస్త్రిస్రో - గతిగమకగీతైక నిపుణే
వివాహవ్యానద్ధ - ప్రగుణగుణసఖ్యా ప్రతిభువః|
విరాజంతే నానా - విధ మధురరాగాకరభువాం
త్రయాణాం గ్రామాణాం - స్థితినియమ సీమాన ఇవ తే||69||
దేవీ ! వివాహ సమయంలో నీ మెడలో కట్టిన మంగళసూత్రములోని మూడు ముడులు మృదు మధుర రాగాలయిన షడ్డగ్రామ, మధ్యగ్రామ, గాంధారగ్రామముల యొక్క ఉనికికి హద్దులాగా కనపడుతున్నవి.
పరమేశ్వరి వివాహ సమయంలో శివునిచేత వేయబడిన ముడులు మూడు ముడతలలాగా కనిపిస్తున్నాయి. అవే దేవి కంఠసీమయందు మూడు ముడుతలు గలవైన మూడు రేఖలు. ఈ రేఖలు అనేక రకాలయిన మనోహరమైన రాగాలు, ఉపరాగాలు, జనకరాగాలు, భాషారాగాలు, విభాషారాగాలు, అంతరాలు, భాషలు అనే ప్రసిద్ధమైనటు వంటి రాగాలకు గనులై, స్వరస్థానాలై, ఆశ్రయములై, షడ్డ, మధ్యమ, గాంధార గ్రామాలనబడే స్వర ఆరోహణ, అవరోహణ క్రమాలన్సింటికీ సరిహద్దుగా ఆ మూడు ముడుతలు కనిపిస్తున్నాయి.
ఈ శ్లోకంలో దేవి కంఠసీమలోని మాంగల్యంలో ఉన్న మూడు ముడులు వళిత్రయమని అదే గాత్రత్రయము అని చెప్పబడింది. ఈ విధంగా పరమేశ్వరి సంగీతనిధి అంటున్నారు శంకరులు.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below