శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0029 నామం : అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా
"ఓం అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజితాయై నమః"
భాష్యం
పరమేశ్వరి యొక్క చుబుకాన్ని వర్ణించటానికి ఇంతవరకు ఉపమానమే దొరకలేదు. బ్రహ్మాది దేవతలందరూ కూడా నునుపైన చెక్కిళ్ళు గలిగి గుండ్రంగా ఉన్నటువంటి ముఖానికి ఈ చుబుకము తొడిమలా ఉన్నది అన్నారు. అంతేకాని ఆ చుబుకానికి ఇంతవరకు సరియైన ఉపమానాన్ని చూపలేకపోయారు. అంటే పరమేశ్వరి చుబుకము సాటిలేనటువంటి అందముగలది. అద్దములో చూసినప్పుడు దాని ప్రతిబింబమే దానికి సరియైన ఉపమానము.
శంకరభగవత్పాదులవారు కూడా దేవిచుబుకాన్ని వర్ణించటానికి వీలు కాదు అంటున్నారు సౌందర్య లహరిలోని 67వ శ్లోకంలో
కరాగ్రేణ స్పృష్టం - తుహినగిరిణా వత్సలతయా
గిరీశే నోదస్తం - ముహు రధరపానాకులతయా |
కరగ్రాహ్యం శంభో - ర్ముఖముకురవృంతం గిరిసుతే
కథంకారం బ్రూమ - స్తవ చుబుక మౌపమ్యరహితమ్||67||
గిరిసుత చుబుకము, తండ్రిచే ప్రేమగా పుణకబడింది. శివునికి దేవి ముఖము అద్దము కాగా, ఆ అద్దమునకు పిడివంటిది, ఆమె చుబుకము. దానిని పోల్చుటకు, మరేదియును సాటిరాదు.
పర్వతరాజ పుత్రీ ! తండ్రియగు హిమవంతునిచే అమితమగు వాత్సల్యముతో మునివ్రేళ్ళతో పుణకబడినది, కైలాసపతిచేత అధరపానమునందలి అనులత్వము చేత మాటిమాటికి తొట్రుపడుచు పైకెత్తబడినది, శంభుని చేతితో మాత్రమే పట్టుకోతగ్గది, సాటిలేనిది అయిన ముఖము అనే అద్దానికి పిడివంటిది అయిన నీ చుబుకమును ఏ విధంగా వర్ణించను అన్నారు తండ్రికి పిల్లల మీద ఉండే ప్రేమను వాత్సల్యము అంటారు. ఈ ప్రేమను వివిధ సందర్భాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.
పిల్లల మీద ఉండేది - వాత్సల్యము
భార్య ఎడ ఉండేది గా ప్రేమ
శిష్యులయందుండేది - అనుగ్రహము
అగ్రజులందుండేది - భక్తి
హిమవంతుడు పరమేశ్వరికి తండ్రి కాబట్టి, అతనికి దేవియందుండునది వాత్సల్యము.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below