శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0028 నామం : మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మనసా
"ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మనసాయై నమః"
భాష్యం
స్మితము అంటే చిరునవ్వు. మందస్మితము అంటే కొద్దిపాటి చిరునవ్వు. ఇది సాధ్వీ లక్షణము నవ్వినప్పుడు పలువరుస కనిపించీ కనుపించకుండా ఉండేదాన్ని చిరునవ్వు అంటారు. ఇది శుభశూచకము మంగళప్రదము. కామేశ్వరుడు అంటే కామేశ్వరీదేవి భర్త. శ్రీచక్రంలోని బిందువు నందు ఉండేది కామేశ్వరి కామేశ్వరులని, రాజేశ్వరి రాజేశ్వరులని అంటారు. వారే శివశక్తులు. ఆ
కామేశ్వరుణ్ణి మనసునందు భావించుటచే ఆనందము పొందునది. ఈ ఆనందము ఐదు
రకాలు.
1. కారణరహిత ఆనందము 2 బ్రహ్మానందము
3. నాదానందము 4. పరమేశ్వరానందము 5. ప్రణవానందము
తన నాధుడు అయిన కామేశ్వరుణ్ణి మనసున తలచుకోవటంచేత దేవి పరమేశ్వరానందం పొందుతున్నది. మనసులో ఉన్న ఆ ఆనందము ముఖంలో పెదవులమీద కనిపిస్తున్నది.
శంకరభగవత్సాదుల వారు ఈ విషయాన్ని వివరిస్తూ తమ సౌందర్య లహరిలోని శ్లోకం 63
స్మితజ్యోత్స్నాజాలం - తవ వదనచంద్రస్య పిబతాం
చకోరాణామాసీ -దతిరసతయా చంచుజడిమా |
అతస్తే శీతాంశో -రమృతలహరీ మామ్లరుచయః
పిబంతీ స్వచ్ఛందం - నిశి నిశి భృశం కాంజి కధియా || 63 ||
చకోర పక్షులు, దేవి చిఱునగవులనే వెన్నెలను, గ్రోలుచున్నవి. అవి అతి మధురములైనందున, అందుకు విరుగుడుగా, అమృతమును, పుల్లని కడుగునీళ్ళగా భావించి, త్రాగుచున్నవి.
భావము:- అమ్మా..భగవతీ ... నీ వదనం చంద్రబింబం అయితే, నీ చిరునవ్వు, చంద్రుడి నుండి కురిసే వెన్నెల. అదుగో, నీ చిరునవ్వనే వెన్నెలను తాగిన పులుగు (చకోర) పక్షులు, అమృత తుల్యమైన, అతి మాధుర్యమయమైన ఆ తీపికి, తమ నోటికి మాధ్యం (అరుచి లేదా మొహంమొత్తి) కలిగి, కొంచెం మార్పు కోసం,
పులుపును కోరి, ఆ అసలు చంద్రుడు యొక్క వెన్నెలను, పులికడుగు నీళ్ళుగా భావించి, త్రాగుచున్నవి. (అనగా ఆ చంద్రుని వెన్నెల కాంతులకన్నా, అమ్మ ముఖ చంద్రుని మందహాస వెన్నెల కాంతులు గొప్పవని భావన)
{ఈ శ్లోకంలో అమ్మ ముఖమును, అమృతతుల్య అమ్మ మధుర దరహాసం ను వర్ణించిరి. లోకంలో చకోర పక్షులను ఒక జాతి కలదు. ఈ పక్షులు, వెన్నెలరాత్రులలో తల పైకెత్తి, చంద్రుని నుండి కురిసే వెన్నెలలోని అమృత బిందువులను త్రాగుతూ ఉంటాయని, ప్రతీతి. కవి దీనిని ఉపయోగించుకుంటూ, అతిశయోక్తి గా, అమ్మా నీ ముఖంలోని చిరునవ్వుల వెన్నెల మాధుర్యం తాగి, అతి తీపితో మొహం మొత్తిన ఆ పక్షులు, కొంచెం రుచి మార్పు కోసం, (నోరంతా తీపి అయినప్పుడు కారం తిన్నట్లుగా), ఆ చంద్రుని వెన్నెల త్రాగుచున్నాయి తప్ప, ఆ వెన్నెల, నీ ముఖ మండల చిరునవ్వు వెన్నెల కన్నా గొప్పది కాదు అని శ్రీ శంకరుల వర్ణన. లలితా సహస్రం లో, అమ్మ చిరునవ్వు ను వర్ణిస్తూ,
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా
అని ఒక నామం. ప్రళయ కాలమందు, అతి కోపంగా ఉన్న కామేశ్వరుడిని , అమ్మ తన చల్లని చిరునవ్వుల వెన్నెలలతో, ఆయన మనస్సుని ప్రభావితం చేసి, శాంత పరచునని అర్ధం.}
అమ్మా! భగవతీ, అతిమధురమైన నీ ముఖచంద్రబింబ మందహాస వెన్నెలను గ్రోలుతున్న చకోర పక్షుల నాలుకలు, మొద్దుబారినవైనవి. అందువల్ల, తమ జిహ్వాలు తిరిగి రుచిని పొందుటకై, అవి ప్రతిరాత్రి, ఇష్టానుసారం, చంద్రుడి అమృతపు వెల్లువను, అన్నపుగింజ అనేభ్రాంతితో, త్రాగుతున్నవి.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below