శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0023 నామం : పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః
"ఓం పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభువే నమః"
భాష్యం
పద్మరాగశిలలు అను అద్దములను మించిన నునుపైన, కాంతులీనుచున్న చెక్కిళ్ళు గలది.
పద్మరాగాలు స్వచ్చంగాను, నున్నగాను ఉంటాయి కాబట్టి అద్దములకన్న శ్రేష్టమైనవి. వాటిని మించినవి పరమేశ్వరి చెక్కిళ్ళు. చెక్కిలయందు పరమేశ్వరుని ప్రతిబింబం కనిపిస్తుందట.
సింహళంలో దొరికే పద్మరాగాలు కాంతిలోను మృదుత్వంలోను శ్రేష్టమైనవి. అద్వితీయమైనవి. సహజంగా శరీరంలోని భాగాలలో చెక్కిళ్ళు ఎర్రగా ఉంటాయి. ఇది సౌందర్యలక్షణం. యవ్వనవతులకు ఈ లక్షణం మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే పరమేశ్వరి నిత్య యవ్వనవతి. లలితా అష్టోత్తరంలో ఆమె “నిత్యయవ్వన మాంగల్య మంగళాయై నమోనమః” అని చెప్పబడింది. కాబట్టి దేవి సర్వకాల సర్వావస్థల యందు నిండు యవ్వనవతి. అందుచేత ఆమె చెక్కిళ్ళు పద్మరాగాలకన్న మిన్నయైన ఎరుపుదనం గలిగి ఉంటాయి. అద్దముల కన్న నున్నగా ఉండి ప్రతిబింబిస్తుంటాయి. దేవి యొక్క చెక్కిళ్ళను వర్ణిస్తూ శంకర భగవత్సాదులవారు సౌందర్య లహరిలోని 59వ శ్లోకంలో
స్పురద్గండా భోగ ప్రతిఫలిత తాటంక యుగళం
చతుశ్చక్రం మన్యే తవ ముఖ మిదం మన్మథరథం ।
య మారుహ్య ద్రుహ్య త్యవనిరథ మర్కేందుచరణం
మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే ॥
ఓ భగవతీ ! అద్దములాగా నిగనిగమెరుస్తున్న నీ చెక్కిళ్ళ విశాల ప్రదేశమందు ప్రతిఫలిస్తున్న రతనాల కమ్మలజంటగల నీ ముఖము “మన్మథుని రథము” అని తలచుచున్నాను. ఆ రథమధిష్టించి మన్మథుడు భూమిరథముగా, రవిచంద్రులు చక్రాలుగా గల త్రిపురాంతకుడగు రుద్రునికి ద్రోహమాచరించుచున్నాడు.
బహిర్మాతృకాన్యాసంలో దక్షిణకపోలము “ ” కారము వామకపోలము “ ” కారము
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below