శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పద్దెనిమిదవ నామం : వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా
"ఓం వక్త్రలక్ష్మీపరీవాహచలన్మినాభలోచనాయై నమః"
భాష్యం
"ఓం నమః"
ముఖకాంతి అనే ప్రవాహంలో కదలాడుతున్న చేపల జంటతో సాటి అయిన కనులు గలది. అందుచేతనే దేవి మీనాక్షి అని పేరు పొందింది.
వక్రము అంటే ముఖము. ఇది వాగ్భవకూటమి. ఐం బీజాన్ని నిర్దేశిస్తుంది. లక్ష్మీప్రదము. ఐశ్వర్యప్రదము. ఐశ్వర్యము, విద్య రెండూ పెల్లుబుకుతున్న పరమేశ్వరి ముఖపద్మమనే ప్రవాహంలో కదలాడుతున్న చేపల జంటలాగా ఆ దేవి కనుదోయి ఉన్నది. ఇక్కడ దక్షిణనేత్రానికి ఇంద్రుడు, వామనేత్రానికి విరాట్పురుషుడు అధిష్టానదేవతలు.
దేవి నేత్రాలను చేపలతో పోల్చటం ఒక విశేషము. చేపలు సంయోగము, సంపర్కము లేకుండానే, కేవలం చూడటంచేతనే సంతానోత్పత్తి చేస్తాయి. వీటి వీక్షణ మాత్రంచేతనే
సంతానానికి ఆహారం లభిస్తుంది. అలాగే భక్తులు కూడా పరమేశ్వరి అనుగ్రహం పొందినట్లైతే వారికి సర్వాభీష్టసిద్ధి కలుగుతుంది. అందుచేతనే ఆమె మీనాక్షి, చేపకనుల వంటికనులు కలది. అంటే వీక్షణమాత్రంచేతనే వాంచితార్థములిచ్చేది.
సౌందర్య లహరిలోని 48వ శ్లోకంలో శంకరభగవత్సాదులు దేవి కనులను వర్ణిస్తూ
అహస్యూతే సవ్యం తవ నయన మర్మాత్మ కతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా ॥
తృతీయా తే దృష్టి ర్రరదళితహేమామ్బుజరుచి
స్సమాధత్తే సన్ధాం దివసనిశయో రన్తరచరీమ్ ॥
తల్లీ నీ కుడి కన్ను సూర్యుడు. కాబట్టి పగటిని జనింపచేస్తాడు. ఎడమకన్ను చంద్రుడు. కాబట్టి రాత్రిని జనింపచేస్తోంది. నీ మూడవకన్ను అహోరాత్రులకు మధ్య ఉదయసాయంసంధ్యలు కావిస్తున్నది.
ఈ రకంగా దేవికనులు పగలు, రాత్రి, సంధ్యాకాలము, వాటివల్ల పక్షాలు, మాసాలు, సంవత్సరాలు, యుగాలు కలుగుతున్నాయి. వీటన్నింటికీ ఆమె అతీతురాలు. ఆ దేవి నేత్రాలు వివిధరకాలయిన దృష్టులను కలిగి ఉన్నాయి శంకర భగవత్పాదులు వారు తమ సౌందర్య లహరిలోని 49వ శ్లోకంలో అంటున్నారు.
విశాలా కల్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయైః
కృపాధారాన్ ధారా కి మపి మధురాన్ భోగవతికా
అవన్తీ సృష్టి స్తే బహునగరవిస్తారవిజయా
ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే ॥
దేవినేత్రాలు విశాల మొదలు విజయ వరకు ఎనిమిది నగరాలకు ప్రతీకలు.
1. ఆ నేత్రాలు విశాలమైనవి కాబట్టి విశాల నగరానికి ప్రతీక. అంతర్వికాశంతో కూడినది విశాల అనే దృష్టి, దృష్టి అనేది అందరికీ సమానమేకాని కొందరి దృష్టిలో ప్రత్యేకత ఉంటుంది. అలాగే దేవి దృష్టిలో
1సంక్షోభణము 2. ద్రావణము 3. వశ్యము 4 విద్వేషణ
5. ఆకర్షణము 6. ఉన్మాదము 8. ఉచ్చాటన 9. మారణము.
అనేవి ఇక్కడ ప్రత్యేకమైనవి. భగవతి ఏ ప్రదేశంలో నిలబడి విశాల అనబడే దృష్టితో జనసంక్షోభం కావించిందో, ఆ ప్రదేశమే విశాలనగరము.
2. కళ్యాణవంతమైన దృష్టికాబట్టి కల్యాణి నగరము చెప్పబడింది. ఈ దృష్టి ఆశ్చర్యము లేక నవ్వుతో కూడినది. దేవి ఏ ప్రదేశంలో కల్యాణీ దృష్టితో జనాకర్షణ గావించిందో, ఆ ప్రదేశము కల్యాణీనగరము.
3. స్ఫుటమైన కాంతి కలిగి నల్ల కలువలకు మించిన సౌందర్యము గలది, అయోధ్యా
నగరమునకు ప్రతీక అయినది అయోధ్యా దృష్టి, మొలకనవ్వుతో కూడిన కనుగ్రుడ్లు గల దృష్టిని అయోధ్యాదృష్టి అంటారు. దేవి ఏ ప్రదేశంలో నుంచుని అయోధ్యాదృష్టితో ద్రావణము కావించిందో, ఆ ప్రదేశము అయోధ్య.
4. కృపాసారమృతధారకు ఆధారమైనది దారా నగరము. అలసభావము లేక మాంధ్యము గల దృష్టిని దారాదృష్టి అంటారు. దేవి ఏ ప్రదేశంలో దారాదృష్టితో శత్రువులకు ఉన్మాదం తెప్పించిందో, ఆ ప్రదేశము దారానగరము.
5. అవ్యక్తమధురమై ఇలాంటిది అని చెప్పటానికి వీలుకానిది మధురానగరము. వక్రప్రసారము గల దృష్టిని మధురాదృష్టి అంటారు. దేవి ఏ ప్రదేశంలో శత్రువులను వశీకరణ కావించిందో అది మధురానగరము.
6. పరిపూర్ణత గలిగి, అభోగము కలదైన నగరము భోగవతి. సుందరమై స్పేహముతో కూడిన దృష్టిని భోగవతీదృష్టి అంటారు. దేవి ఏ ప్రదేశంలో శత్రువులకు ఉచ్చాటన చేసిందో, ఆప్రదేశమే భోగవతీ నగరము.
7. భక్తజనావసమై ఆశ్రితరక్షితమైనది అవంతీపురము. యవ్వనారంభదశలో ఉన్న కన్నెద్యృష్టి అవంతీదృష్టి. ఏప్రదేశంలో దేవి విద్వేషణ చేసిందో ఆ ప్రదేశము అవంతీ నగరము.
8. విజయాలకునిలయమైనది విజయానగరము. కంటి చివరిభాగాన్ని తాకిన నల్లగుడ్డు గల దృష్టి విజయాదృష్టి. ఏ ప్రదేశంలో దేవి విజయాఖ్యదృష్టితో శత్రుమారణం గావించిందో, ఆ ప్రదేశము విజయానగరము.
ఈ రకంగా పరమేశ్వరి కనులు రకరకాలయిన దృష్టులను కలిగి ఉన్నాయి. అన్నిటికీమించి ఆమె దయాద్రుక్కులు ప్రసరిస్తే చాలు వాంఛితార్థాలు ఈడేరుతాయి.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below