శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని పదనాల్గవ నామం : కురువింద మణి శ్రేణి లసత్కోటీర మండితా
"ఓం కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండితాయై నమః"
భాష్యం
కామము అనురాగము మొదలయిన గుణములు కలమణులను 'కురువిందమణులు” అంటారు. ఈ మణులన్నీ రావణగంగ” అను నదీతీరంలో దొరకుతాయి. ఆ నదిలో దొరికే సౌగంధికము, కురువిందము, స్పటికముల నుండి పుట్టిన వాటిని మణులు అంటారు. వీటిలో కురువిందముల నుండి పుట్టినవి పద్మరాగమణులు అంటారు. ఈ మణులు మంకెనపువ్వు, దాసానిపువ్వు, రక్తవర్ణము, దానిమ్మగింజలరంగులో ఉంటాయి. ఈ రకంగా కురువిందములనుండి పుట్టిన మణులు శ్రేష్టమైనవి. స్వచ్చమైన కాంతిగలవి. స్పటికములనుంచి పుట్టిన వాటికి ఈ లక్షణాలుండవు. ఈ విషయాలన్నీ గరుడపురాణంలో చెప్పబడ్డాయి.
పరమేశ్వరి యొక్క కిరీటము పద్మరాగమణులతో ప్రకాశిస్తున్నది. ఆ మణులయొక్క ఎరుపుదనము భక్తుల యొక్క భక్తిని ప్రవర్తిల్ల చేస్తుంది. అమ్మవారు ఎరుపురంగులో ఉంటుంది. ఎర్రని వస్త్రములు ధరిస్తుంది. ఎర్రని పూలు ధరిస్తుంది. ఆమె కిరీటంలోని మణులు కూడా ఎరుపురంగు గలవే.
కురువిందములు మణులు రెండుపదాలుకావు. అది ద్వంద్వ సమాసము అంతకన్న కాదు. అలా ఎవరైనా చెప్పినట్లైతే వారికి రత్నోత్పత్తిని గురించి తెలియదు. అని చెప్పాల్సి ఉంటుంది.
మాణిక్యములు నాలుగు రకాలు. అవి దొరికే ప్రదేశాన్ని బట్టి ఈ విభాగం చెయ్యబడ్ద్డది. వీటిలో.
సింహళంలో దొరికేవి పద్మరాగాలు. ఇవి శ్రేష్టమైనవి.
కొల్హాస్తురము నందు దొరికే పద్మరాగాలు కొద్దిగా పసుపు రంగు కలిగి ఉంటాయి.
ఆంధ్రదేశంలో దొరికే వాటిని సౌగంధికాలు అంటారు. ఇవి మధ్యరకానికి చెందినవి.
తుంబురమున దొరికేవి కొద్దిగా నీలంరంగులో ఉంటాయి. ఇవి తక్కువజాతివి.
కామానురాగః కురువిందజేషు యాస్తానతాదృక్ స్ఫటికోద్భవేషు
మాంగల్యయుక్తాన్ హరిభక్తిదాశ్చ వృద్ధిప్రదాస్తే స్మరాణాదృవన్తి.
కామము అనురాగము అనేగుణాలు గలవి కురువిందమణులు. వాటి నుండి పుట్టిన మణులచేత అలంకరించబడిన కిరీటము గలది ఆ దేవి. అటువంటి పరమేశ్వరిని ధ్యానించుట సర్వ మంగళ ప్రదము.
పరమేశ్వరి కిరీటంలో పొదగబడినవి మణులు కాదు. మణులని బ్రమింపచేసే ద్వాదశాదిత్యులు అంటారు శంకరభగవత్సాదులు తమ సౌందర్యలహరిలోని 42వ శ్లోకంలో
గతై ర్మాణిక్యత్వం గగనమణిభి స్సాంధ్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే ! కీరయతి యః
స నీడే యచ్చాయాచ్చురణ శబలం చంద్రశకలం
ధను శ్శౌనా సీరం కి మితి న నిబధ్నాతి ధిషణామ్ ॥
హిమవంతుని పుత్రికవగు ఓ తల్లీ ! ఆకాశంలో ప్రకాశించే ద్వాదశాదిత్యులనబడే మాణిక్యములచే కూర్చబడి, తయారుచేయబడినదైనటువంటి నీ బంగారు కిరీటమును ఎవడు వర్ణించుచున్నాడో, అతడు నీకు పాపటబొట్టుగా ఉన్న చంద్రరేఖను గాంచి, అది ఇంద్రధనుస్సే అని భ్రమిస్తాడు.
కిరీటంలోని ఎర్రనికాంతులు గాయత్రీవర్ణద్యోతకము అని కొందరు చెబుతారు. కాగా గుంటూరు శృంగేరీ శ్రీవిరూపాక్షపీఠవ్యవస్థాపకులైన శ్రీశ్రీశ్రీ కళ్యానానందభారతి ఈ కాంతులు శ్రీకళాయంత్రంలోని అనేకవృత్తాలను తెలుపుతాయి అంటారు.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below