శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని తొమ్మిదవ నామం : క్రోధాకారాంకుశోజ్వలా
"ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః"
భాష్యం
క్రోధము అంటే ద్వేషము అనే పేరుకల మనోవ్యాపారము. మనకు ఇచ్చగనక బాగా కలిగినట్లైతే, అంటే ఒక మనిషియందు మనకు అత్యంతమైన ప్రేమ, అనురాగము ఉన్నాయి. ప్రతి విషయంలోనూ వారే ఉన్నతులుగా ఉండాలి అనుకుంటాం. అలాంటప్పుడు ఒకవేళ మనం అనుకున్నట్లుగా గనకవారు రాలేకపోయినప్పటికీ దాన్ని మనం భరించలేం. ఎదుటివారి గొప్పదనాన్ని ఒప్పుకోలేం. వారిమీద ఏదో కారణంగా కోపం పెంచుకుని వారిని అసహ్యించుకుంటాం. దీనికి కారణము మనవారి పట్ల మనకున్న రాగము. దీనివల్లనే మన వారు చేసిన తప్పులు కూడా ఒప్పులుగాను, ఎదుటి వారు చేసిన
ఒప్పులు కూడా తప్పులుగాను కనిపిస్తాయి. అంటే మితిమీరిన అనురాగమే క్రోధము క్రింద మారుతుంది. మనమీద మనకు నమ్మకముంటుంది. ఆత్మాభిమానం ఉంటుంది. అంతవరకు మంచిదే. కాని అది బాగా పెరిగిపోతే దురభిమానమవుతుంది. అదే ఆవేశకావేశాలకు కారణం. అదే క్రోధం అందుకే క్రోధో ద్వేషాఖ్యా చిత్త వృత్తిః క్రోధము అనేది ద్వేషము అనే పేరుగల చిత్తవృత్తి. పరమేశ్వరికి కుడివైపున్నటువంటి పైచేతిలో అంకుశమున్నది. అంకుశము బాధించేది. క్రోధము వల్ల ఇతరులకు బాధకలుగుతుంది. ఇతరులను బాధించటమే క్రోధము యొక్క ముఖ్యలక్షణము. అంకుశము అంటే ఏనుగును పొడిచి నడిపించే ఆయుధము. అనగా బాధించేది. కాబట్టే క్రోధానికి
గుర్తుగా దేవి కుడి చేతిలో అంకుశమున్నది.
ఇది భక్తులకు జ్ఞానరూపము. దుష్టుల ఎడ అంకుశము. క్రోధమనేది రజోగుణము. అట్టి క్రోధాకారమైన అంకుశము చేతియందు గలది ఆ పరమేశ్వరి. చతుశ్శతిలో చెప్పినట్లుగా
పాశాంకుశౌ తదీయౌ తు రాగద్వేషాత్మకే స్మృతౌ
దేవి పాశము అంకుశము ధరించి ఉంటుంది. అవి రాగద్వేషాలకు ప్రతీకలు. యోగినీహృదయంలో
ఇచ్చాశక్తిమయం పాశం అంకుశం జ్ఞానరూపిణం
క్రియాశక్తిమయే బాణధనుషీ దధ దుజ్జ్వలమ్ ॥
పాశము - ఇచ్చాశక్తి. అంకుశము - జ్ఞానరూపము. ధనుర్బాణములు క్రియాశక్తిమయాలు.
ఏదైనా జీవి హింసించబడేటప్పుడు, అది ఆ బాధ భరిస్తూ, ఎదిరించలేక “ఓ దేవీ! నన్ను హింసిస్తున్నారు. వారిని ఎదిరించే సామర్ధ్యము నాకులేదు. ముందు జన్మలోనైనా ఇటువంటి వారిని ఎదిరించే సాహసము నాకు కలుగజెయ్యవలసినది” అని ఏడుస్తూ ప్రార్థిస్తుంది. ఈ జన్మలో దాని శరీరము నశించినప్పుటికీ ప్రతీకారజ్వాల మాత్రం దాని మనసును అంటిపెట్టుకుని ఉంటుంది. అప్పుడు మరుజన్మలో ఆ జీవికి అది క్రోధము అవుతుంది. ఈ విధంగా ప్రపంచంలో జరిగే ప్రతి హింసా ప్రవృత్తికీ గతజన్మలోని అనుభవాలే కారణము. అదే పరమేశ్వరి చేతిలోని అంకుశశక్తి. పాపం చేసినటువంటి వారికి ఇది అంకుశము. మిగిలినటువంటివారికి ఇది ఆభరణము. శ్రీచక్రంలోని ఎనిమిదవ ఆవరణ అయిన త్రికోణంలో దీన్ని పూజిస్తారు.
ఓంఐంహ్రీంక్రోంక్రోం సర్వస్తంభనాభ్యాం
కామేశ్వరీ కామేశ్వరాంకుశాభ్యాం నమః అంకుశశక్తి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
దుర్వాసుడు శ్రీ దేవీ మహిమ స్తుతిలోని 44వ శ్లోకంలో అంకుశాన్ని ధ్యానిస్తూ
యః స్వాన్తే కలయతి కోవిద స్త్రీ లోకీ
స్తంభారంభణచణ మత్యుదారవీర్యం ।
మాత స్తే విజయమహాంకుశం స యోషా
న్దేవా స్పృమృయతి చ భూభుజోల న్యసైన్యమ్ |
తల్లీ ! ముల్లోకములను స్తంభింపచేయకల నీ అంకుశబీజమును ఉపాసన చేసేవాడు సకల స్త్రీలను, దేవతలను, రాజులను, శత్రువులసైన్యాలను కూడా స్తంభింపచేయగలుగుతాడు.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below