లలితా రహస్య నామ అర్ధము & భాష్యం
0006 ఆరవ నామం : ఉద్యత్ భాను సహస్రాభా
ఉద్యత్ భాను సహస్రాభా : వేయిమంది ఉదయ సూర్యుల వలె ప్రకాశించు తల్లికి నమస్కారము.
Udyath Bhaanu Sahasraabhaa : She who glistens like thousand rising suns. salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము & భాష్యం
0006 ఆరవ నామం : ఉద్యత్ భాను సహస్రాభా
ఉద్యత్ భాను సహస్రాభా : వేయిమంది ఉదయ సూర్యుల వలె ప్రకాశించు తల్లికి నమస్కారము.
Udyath Bhaanu Sahasraabhaa : She who glistens like thousand rising suns. salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని ఆరవ నామం : ఉద్యత్ భాను సహస్రాభా
"ఓం ఉద్యద్భానుసహస్రభాయై నమః"
భాష్యం
బిందురూపుడుగా ఉన్న పరబ్రహ్మ, కర్మపరిపక్వం కాకుండా తనలో లీనమయి ఉన్న జీవరాసుల కర్మలను క్షయం చేసి, వారికి మోక్షం ప్రసాదించాలనే సంకల్పంతో సృష్టి చెయ్యాలని సంకల్పించాడు, అనుకున్నదే తడవుగా తనలోనుండి కొంత శక్తిని బయటకు పంపాడు. ఈ రకంగా బిందురూపంలో ఉన్న పరబ్రహ్మ శివశక్తులుగా మారాడు. శివశక్తులిద్దరూ వేరుకాదు. వారిద్దరూ ఒకటే. ఒకే నాణానికి బొమ్మా బొరుసులాంటివారు. ఒకే విత్తనంలో ఉన్న రెండు బద్దలలాంటివారు. ఆ శక్తి త్రికోణ రూపంలో ఉంటుంది. శివుడు బిందురూపంలో ఉంటాడు. అంటే శివుడు బిందురూపుడు కాబట్టి అవ్యక్తుడు. అదే శక్తి త్రికోణరూపిణి. అనగా ఒకరూపమున్నది. అందుచేతనే ఆ శక్తి వ్యక్తరూపిణి, కంటికి కనిపిస్తుంది. అంటే శక్తికి రూపమున్చది. ఆమెయే పరమేశ్వరి.
దేవీభాగవతంలో తారకాసురుని బాధలు భరించలేని రాక్షసులు పరమేశ్వరిని ధ్యానిస్తారు. చైత్ర శుద్ధ నవమి శుక్రవారం ఆ దేవి వారికి సాక్షాత్కరిస్తుంది. ఆ సమయంలో దివ్యమైన తేజోమయమైన కాంతిపుంజము అనేకకోట్ల సూర్యులకాంతులతో వారికి దర్శనమిస్తుంది. కొన్నికోట్ల విద్యుత్కాంతులతో తళుక్కున మెరిసింది. దానికి పైన క్రింద అడ్డము అనేవిలేవు. ఆద్యంతాలు లేవు. కాలు చేతులు లేవు. స్రీ పురుష నపుంసక బేధాలు లేవు. ఆ తేజస్సు చూడలేక దేవతలు కనులు మూసుకున్నారు.
ఇంతలోనే ఆ తేజోరాసి ఒక స్త్రీ రూపం దాల్చింది. ఆమె రమణీయాంగి. కుమారి నవయవ్వనమై అలరారుతున్నది. బంగారు కేయూరాలు, గ్రైవేయముతో అలంకరించ బడింది. మేలైన జాతిమణుల హారాలు ధరించింది. రకరకాల పూలను సిగలో అలంకరించుకుంది. కర్పూర తాంబూలము నములుతున్నది. అష్టమినాటి చంద్రుని బోలిన ముఖముతో, వెడల్పయిన కనుబొమలు, ఎర్రకమలములవంటి కనులు, ఎత్తైన నాసిక, మధురాధరము గలది. ఆమె దంతాలు మల్లెమొగ్గలులా ఉన్నాయి. ముత్యాలహారాలు, వజ్రాలహారాలు మెడలో ధరించింది. కేశాలు మల్లిక, మాలతి, సుమాలతో గుబాళిస్తున్నాయి. కస్తూరి తిలకం ధరించింది. మూడు కనులున్నాయి. ఎర్రని వస్త్రాలు ధరించి, దానిమ్మపూలవలె ఎర్రనికాంతులు విరజిమ్ముతున్నది. నాలుగు చేతులయందు పాశము, అంకుశము, ధనుస్సు, బాణాలు ధరించింది.
ఆ పరమేశ్వరిని దర్శించిన దేవతలకు నోటమాటరాలేదు అని చెప్పబడింది. ఇది పరమేశ్వరి స్వరూపం.
ఇక 6 నుంచి 54 నామాల వరకు అంటే 49 నామాలలో దేవిస్థూలదేహాన్ని వర్ణిస్తున్నారు. ఇందులో పరమేశ్వరి రూపలావణ్యాలు పూర్తిగా చెప్పబడతాయి.
ఉదయించుచున్న వేయి సూర్యులకాంతి గలది. సూర్యుని కిరణాలు వేయి. ఉదయించటమనేది అతడికి విశేషణము. బాలభానుడు అరుణారుణచ్చయలో ఉంటాడు. కాబట్టి ఉదయిస్తున్న వేయి సూర్యులకాంతితో ప్రకాశిస్తున్నది పరమేశ్వరి. ఇక్కడ వేయి అనేది ఒక సంఖ్యను నిర్దేశించటంకోసం చెప్పబడింది. నిజంగా చెప్పాలంటే భైరవయామళంలో పరమేశ్వరి కాంతుల్ని వివరిస్తూ
తేషాం అనంతకోటీనాం మయూఖానాం మహేశ్వరి !
ఈ రకంగా లెక్కలేనన్ని, లెక్కకురానన్ని, లెక్కపెట్టటానికి వీలుకానన్ని కాంతి కిరణాలతో ఆ దేవి ప్రకాశిస్తున్నది. వాటిలోని కొన్ని కిరణాలవల్లనే బ్రహ్మాండమంతా ప్రకాశిస్తున్నది. దేవి నుంచి ప్రసరించే కిరణాలలో
అష్టోత్తరశతం వహ్మేే, షోడశోత్తరశతంరవేః ।
షట్రింశ దుత్తర శతం చంద్రస్యకిరణా శివే ॥
108 కిరణాలను అగ్నిదేవుడు, 116 కిరణాలను సూర్యుడు, 186 కిరణాలను చంద్రుడు గ్రహించగలిగారు.
బ్రహ్మండం భాసయంత ప్తే పిండాండ మపి శాంకరి ! ।
దివా సూర్య స్తథా రాత్రౌ సోమో వహ్ని శ్చ సంధ్యయోః ॥
పగటిపూట సూర్యుని వెలుగులతోను, రాత్రిపూట చంద్రుని కాంతులతోను, సంధ్యవేళ యందు అగ్నికాంతులతోను ఈ జగత్తు ప్రకాశిస్తున్నది. అంటే చరాచరజగత్తు ఈ రకంగా ప్రవర్తిల్లుతూ ఉండటానికి కారణం ఆ దేవి శరీరం నుంచి వచ్చే కిరణసముదాయమే.
దేవీభాగవతంలో కూడా ఆ దేవి కాంతులను వర్ణిస్తూ అనేకకోటి సూర్యానాం చంద్రకోటి సుశీతలం. కొన్నికోట్ల సూర్యుల యొక్క కాంతులతో ఆ దేవి ప్రకాశిస్తుంటుంది
అని చెప్పబడింది. కాబట్టి ఆ దేవి అనేకకోట్ల సూర్యకాంతులు ప్రసరిస్తూ ఉంటుంది. ఇక ఆ దేవి యొక్క శరీరచ్చాయ గురించి చెబుతూ ఉద్యద్భాను సహస్రాభా అన్నారు. అంటే ఉదయిస్తున్న సూర్యునివలె అరుణారుణచ్చాయలో ఉంటుంది.
అరుణాం కరుణాతరంగితాక్షీం అని చెప్పటం జరిగింది. అంటే ఆ దేవి అరుణకాంతులతో ప్రకాశిస్తున్నది అన్నమాట.
ఆధారచక్రంలో శివశక్తులను ధ్యానిస్తూ
జపాకుసుమ సంకాశా మధుఘూర్గిత లోచనౌ
జపాకుసుమము అంటే మంకెన పువ్వు. ఎరుపు, తెలుపు కలిసినవర్ణంలో ఉంటుంది. స్వతంత్ర తంత్రంలో
స్వాత్మైవ దేవతా ప్రోక్తా లలితా విశ్వ విగ్రహా ।
లౌహిత్యం తద్విమర్శస్స్యాత్ ఉపాస్తి రితి భావనా ॥
విశ్వరూపిణి అయిన లలితాదేవి స్వస్వరూపంలో ఎర్రని దేహచ్ఫాయ కలిగి ఉన్నది. అలా భావన చేసే దేవిని ఉపాసించాలి.
వామకేశ్వరతంత్రంలో స్వయం హి త్రిపురాదేవీ లౌహిత్యం తద్విమర్భనమ్.
త్రిపురాదేవి స్వయంగా ఎర్రదైన విమర్శ అగుచున్నది.
సకుంకుమవిలేపనా మళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం
అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరే దంబికామ్ ॥
“జపాకుసుమభాసురాం” అంటే మంకెన్నపువ్వులాగా అరుణారుణచ్చాయలతో ప్రకాశించేది.
సూర్యోదయానికి ముందు సూర్యుని సారథి అయిన అనూరుడు వస్తాడు. అతన్నే అరుణుడు అని కూడా అంటారు. ఆ సమయంలో ఆకాశం అంతా ఎర్రనికాంతులలో నిండిఉంటుంది. అవే అరుణకాంతులు.
జీవకోటికి పగలు జాగ్రద్దశ. రాత్రులందు సుషప్తి. సుషుప్తిలో మనోవృత్తి ఉండదు. జాగ్రదవస్థలోనే మనోవృత్తి ఉంటుంది. తెల్లవారగానే మనోవృత్తులు ప్రారంభమవుతాయి.
ఇవి అనంతమైనవి. మానవుని హృదయంలో ఉండే ఆ పరమేశ్వరి, మానవుని యొక్క అనంతమైన మనోవృత్తులను ప్రకాశింపచేస్తుంది. అందుచేతనే ఆమె ఉద్యద్భాను సహస్రాభా అని చెప్పబడుతోంది.
పరమేశ్వరికి మూడు రూపాలు చెప్పబడ్డాయి.
1. స్థూలరూపము : మధ్యములచేత ఆరాధించబడేది. ఇది సాకారము.
2. సూక్ష్మరూపము : ఇది మంత్రము. ఉత్తములచే ఆరాధించబడుతుంది. ఇది విమర్శరూపము.
౩.కారణరూపము: ఇది యంత్రరూపము. ఉత్తమోత్తములచే ఆరాధించబడుతుంది. శ్రీచక్రము. ఇది ప్రకాశరూపము.
ఈ నామం నుంచి పరమేశ్వరి స్థూలరూపాన్ని వివరిస్తున్నారు. ఉదయిస్తున్న వేయి సూర్యుల వెలుగుతో ఆ దేవి ప్రకాశిస్తున్నది. ఆమె కాంతులను చర్మచక్షువులతో మనం చూడలేము. బ్రహ్మాండవ్యాప్తమైన తేజస్సే ఆమె రూపము.
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below