శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని ఐదవ నామం : దేవకార్య సముద్యతా
"ఓం దేవకార్య సముద్యతాయై నమః"
భాష్యం
దేవతల యొక్క కార్యములు పూర్తి చెయ్యటం కోసం ఆ పరమేశ్వరి భూలోకంలో అవతరిస్తుంటుంది. మార్కండేయ పురాణంలో దేవానాం కార్యసిద్యర్థం ఆవిర్భవతి సాయదా! ఉత్పన్నేతి తథా లోకే సా నిత్యా ప్యభిధీయతే కాబట్టి ఆపన్నులను రక్షించటం కోసం పరమేశ్వరుడు భూలోకంలో ఉద్భవిస్తూనే
ఉంటాడు. అయితే నిరాకారుడు నిర్గుణస్వరూపుడు అయిన పరబ్రహ్మ పుట్టటం ఏమిటి? అంటారు. పరబ్రహ్మకు పుట్టుకలేదు. కాని భగవద్గీతలో చెప్పినట్లుగా
యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత ! ।
అభ్యుత్థాన మధర్మస్య తదా త్మానం సృజామ్యహం ||
లోకంలో తన అవసరం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ నిరాకారుడు సాకారుడుగా జన్మిస్తాడు.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్పృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥
దుష్టశిక్షణార్థమై ఆత్రత్రాణ పరాయణుడైన శ్రీమన్నారాయణుడు ప్రతియుగంలోనూ ఆవిర్భవిస్తుంటాడు. చండీసప్తశతిలో శుంభ నిశుంభుల వధ జరిగిన తరువాత దేవతలు పరమేశ్వరిని పరిపరివిధాల కీర్తించి ఆమెను అడుగుతారు.
సర్వబాధా ప్రశమనం త్రైలోక్య స్యాఖిలేశ్వరి ॥
ఏవ మేవ త్వయా కార్యం అస్మద్వైరివినాశనం ॥
ఓ తల్లీ ! ఇదేవిధంగా ఎప్పుడూ మా శత్రువులను నాశనంచేసి ముల్లోకాలను రక్షించాల్సింది. ఆ దేవి దేవతలను అనుగ్రహించి ఈ రకంగా చెబుతుంది.
వైవస్వతేఐ న్తరే ప్రాప్తే అష్టావింశతిమే యుగే |
శుమ్ఫో నిశుమ్భ శ్రై వాన్యుత్పత్యేతే మహాసురౌ ॥
నన్దగోపగృహే జాతా యశోదాగర్భసమృ్భవా ।
తత స్తా నాశయిష్యామి విన్ధ్యాచలనివాసిని ! ॥
వైవస్వతమన్వంతరంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో శుంభని శుంభులని ఇద్దరు రాక్షసులు పుడతారు. ఆకాలంలో నందగోపుని ఇంట యశోదాగర్భాన జన్మించి వింధ్యపర్వతాలమీద నివసిస్తూ వారిద్దరినీ సంహరిస్తాను. అంటూ మొదలుపెట్టి
ఇత్థం యదా యదా బాధా దానవోత్థా భవిష్యతి ॥
తదా తదాల వతీ ర్యాహం కరిష్యా మ్యరిసంక్షయమ్ ॥
ఈ రకంగా రాక్షసుల వలన ఎప్పుడెప్పుడు బాధకలుగుతుందో అప్పుడెల్ల నేను అవతరించి శత్రు వినాశనంగావిస్తాను. అని చెబుతుంది.
దేవకార్యసముద్యతా అనేది అష్టాక్షరీమంత్రం. దేవకార్యము అంటే రాక్షససంహారమే. ఇక్కడ దేవకార్యాలు ఏవి అంటే దశావతారాలు ఎత్తి రాక్షస సంహారం చెయ్యటం విష్ణువు పని. అతడు స్థితి కారకుడు, అతడికి కూడా సాధ్యంకాని పనులు ఏవైనా ఉంటే వాటిని పూర్తిచెయ్యటానికి స్వయంగా పరమేశ్వరి యే అవతరిస్తుంది. భండాసురుడు, మహిషాసురుడు మొదలైనవాళ్ళని సంహరించటానికి ఆమె అవతరించింది. ఈ రకంగా ఆమె ఈ లోకంలో మళ్ళీమళ్ళీ ఉద్భవిస్తున్నప్పటికీ, అది ఆమె పుట్టుక కాదు. అవతారం మాత్రమే. పరమేశ్వరి నిత్యురాలు. ఆదిమధ్యాంతములు లేనటువంటిది. ఇదేమాట మార్కండేయ పూరాణంలో చెప్పబడింది. అలాగే కూర్మపురాణంలో
అహం వై యాచితా దేవైః సంస్కృతా కార్యగౌరవాత్
వినిద్ద్య దక్షం పితరం మహేశ్వరవినిన్దకం ॥
ధర్మసంస్థాపనార్థాయ త వారాధనకారణాత్
మేనాదేహా త్సముత్పన్నా త్వా మేన పితరం శ్రితా ॥
“నేను దేవతలచే యాచించబడి కార్యగౌరవముచే నమస్కరింపబడిన దాననై మహేశ్వరుని నిందించిన, తండ్రియైన డక్షుని నిందించి, ధర్మసంస్థాపనకై నీవు ఆరాధించిన కారణమున నిన్ను తండ్రిగా పొంది మేనకాదేవి దేహమునుండి పుట్టితిని” అని హిమవంతుడితో చెబుతుంది.
మావనశరీరం ఒకే ఆకారంలో కనిపించినప్పుటికీ అందులో
పంచప్రాణాలు 5
సప్తధాతువులు 7
ఇంద్రియాలు 10
మనోవృత్తి భేదములు 11
మొత్తం విలక్షణ పదార్థాలు 33
బ్రహ్మండంలోని దేవతల సంఖ్య కూడా 33. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడికి, శాకల్యుడికి వాదం జరుగుతుంది. ఆ వాదనలో యాజ్ఞవల్క్యుడు వివరిస్తాడు. యథార్థానికి దేవతలు ముఫ్ఫైముగ్గురే. వారెవరంటే.
అష్టవసువులు 8
ఏకాదశరుద్రులు 11
ద్వాదశాదిత్యులు 12
ఇంద్రుడు 1
ప్రజాపతి 1
మొత్తం 33
వీరందరిని వివరించుమంటాడు శాకల్యుడు.
శాకల్యుడు : అష్టవసువులు ఎవరు ?
యాజ్ఞవల్క్యుడు : అగ్ని పృథివి, వాయువు, అంతరిక్షం, ఆదిత్యుడు, ద్యులోకము, చంద్రుడు, నక్షత్రాలు. వీటిలోనే జగత్తంతా వ్యాపించి ఉన్నది. కర్మఫలాన్ని బట్టి ఇవి దేహంగా పరిణమిస్తాయి.
శా: రుద్రులు ఎవరు ?
యా: జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు. ప్రాణి యొక్క కర్మ పరిసమాప్తమైనప్పుడు వీరు శరీరం నుండి ఉత్ర్కమిస్తారు. ఈ రకంగా శరీరాన్ని వదలి బంధువులను రోదింపచేస్తారు కాబట్టి ఇవి రుద్రశబ్దంచేత పిలువబడతాయి.
శా: ఆదిత్యులెవరు ?
యా : పన్నెండు నెలలతోకూడిన సంవత్సరమే ఆదిత్యుడు. ప్రాణులయొక్క ఆయుర్దాయాన్ని “అదదానా” అంటే గ్రహిస్తుంది. కాబట్టి ఆదిత్యులనబడతాయి.
శా: ఇంద్రుడు, ప్రజాపతి ఎవరు ?
యా: మేఘమే ఇంద్రుడు, మేఘదేవత కూడా ఇంద్రుడే. యజ్ఞమే ప్రజాపతి.
ఈ రకంగా దేవతల సంఖ్య ముఫ్పైమూడు, శరీరంలోని మొత్తం విలక్షణపదార్థాలు ముఫ్పైమూడు, ఇవి దేవతా సంజ్ఞ గలవి. వీటిని సంతృప్తి పరచటం మానవుడికి అసాధ్యం. అందుచేతనే ఇదికూడా దేవకార్యము అనే చెప్పబడింది. ఈ విలక్షణ పదార్థాలైన దేవకార్యసాధనకు మానవుడి. జ్ఞానమనే అగ్నికుండములో నుంచి ఆ పరమేశ్వరి ఆవిర్భవించింది.
ఈ రకంగా మొదటి ఐదు నామాలలోను పరమేశ్వరి యొక్క ప్రాదుర్భావం వివరించబడింది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below