శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని నాల్గవ నామం : చిదగ్నికుండ సంభూతా
"ఓం చిదగ్నిగుండ సంభూతాయై నమః"
భాష్యం
చిత్ అంటే జ్ఞానము. అదే అగ్నికుండము. అజ్ఞానానికి చిహ్నమైన తమోగుణానికి విరోధి. అవిద్య, అజ్ఞానాలను తొలగించేది పరబ్రహ్మ. చిత్ అంటే జ్ఞానాగ్ని శరీరం లోపలకట్టెలు లేకుండానే నిరంతరము మండే జ్ఞానాగ్ని మోహము అనే అంధకారాన్ని తొలగిస్తుంది. శక్తిసూత్రాలలో చెప్పినట్లుగా చిద్వహ్ని రవరోధపదే ఛన్నోల పి చిన్మాత్రయామేయేంధనం పుష్య తీతి చిత్తు విశ్వమును తన స్వభావము చేతనే దహిస్తుంది. కాబట్టి అగ్ని అనబడుతుంది. అక్కడ చిత్తుకు అగ్నికి తేడా లేదు. చిచ్చక్తి పరమేశ్వరుని పరిశుద్ధ చైతన్యమని, ప్రసిద్ధమైన అగ్నికుండము వంటిది అని చెప్పబడింది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునునితో జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసా త్క్మురుతే ఆర్జున
అర్జునా! జ్ఞానాగ్ని అన్నింటినీ భస్మం చేసి వేస్తుంది అంటాడు. రేణుకాపురాణంలో ఇక్ష్వాకువంశంలో రేణుకుడు అనేవాడు జన్మించాడు. అతడు గొప్ప పరమేశ్వరి భక్తుడు. ఆ దేవిని గురించి అనేక వేలసంవత్సరాలు తపస్సుచేశాడు. అతని తపస్సుకు మెచ్చి అతనికి అనేక వరాలిచ్చింది పరమేశ్వరి. ఆ తరువాత
ఏతస్మి నృన్తరే యజ్లే వహ్నికుండా చృనై ర్ద్విజ
దివ్యరూపాన్వితా నారీ దివ్యాభరణభూషితా
అగ్నికుండములో నుండి మెల్లగా దివ్యరూపంతో, దివ్యాభరణాలతో, చంద్రబింబము వంటి మోముతో బయటకు వచ్చింది అని చెప్పబడింది. అందుచేతనే పరమేశ్వరి అగ్నికుండము నుంచి పుట్టినది అనబడుతోంది.
బ్రహ్మాండపురాణంలో భండాసురునిచే పీడించబడిన దేవతలు పదిమైళ్ళ విస్తారము గల అగ్నికుండము నిర్మించి తమ శరీరాన్ని కోసి హోమం చెయ్యసాగారు. అప్పుడు హోమకుండంలో నుంచి కోటి సూర్యుల కాంతులతో, అనేకకోట్ల చంద్రుల చల్లదనంతో వెలుగొందుచూ బాలభానుని కాంతులతో ఆ దేవి ఉద్భవించింది. అప్పుడా దేవిని గాంచిన దేవతలు సంతసించారు. అని చెప్పబడింది. అంటే పరమేశ్వరి అగ్నికుండం నుండే ఆవిర్భవించింది.
పరమేశ్వరి నిరాకారుడు, నిర్గుణస్వరూపుడు అయిన పరబ్రహ్మ స్వరూపిణి. కాని లోకంలోని భక్తులను రక్షించటం కోసం అగ్నికుండం నుంచి ఉద్భవించి సగుణ పరబ్రహ్మ స్వరూపిణి అయింది.
ఆ జగజ్జనని పరబ్రహ్మ అనబడే అగ్నికుండము నుండి ఆవిర్భవించింది. వ్యష్టిగా చూస్తే ఇది ఆత్మ కుండలి. సమిష్టిగా చిదగ్నికుండము. చిదగ్నికుండము అంటే అఖండమైన జ్ఞానము యొక్క మాయా శబలిత రూపము. అసలు దేవతలే తేజ స్వరూపులు, అనంతమైన తేజస్సు గల పరమేశ్వరి చిదగ్ని చిదగ్నికుండ సంభూత. దేవతలంతా అలసత్వము, మొండితనము, చేతగానితనము మొదలైన దుర్లక్షణాలను తమ శరీరం నుండి తీసి అగ్నికుండంలో ఆహుతి చేశారు. అలాగే మానవులు కూడా తమ అజ్ఞానాన్ని, ఇంద్రియాల అలసత్వాన్ని ఇంద్రియ చపలత్వాన్ని తమ జ్ఞానాగ్నిలో భస్మం చెయ్యగలిగితే అప్పుడు వారియందు ఆ పరమేశ్వరి సంభూత అని చెప్పబడుతుంది.
సృష్టికి పూర్వము అఖండమైన బ్రహ్మతేజస్సు మాత్రమే ఉన్నది. తేజస్సుకు ఒక పరిధి ఉన్నది కాబట్టి కుండము అంటున్నాము. చిత్ అనేదే అగ్నికుండము. అదే చిదగ్నికుండము. జ్ఞానస్వరూపమైన పరమేశ్వరి, అజ్ఞానాన్ని నాశనం చేసే జ్ఞానాగ్ని నుంచి సంభవించింది.
ప్రపంచంలో విషయాలు అనేకముంటాయి. వాటిని బుద్ధికి నివేదించేది ఇంద్రియాలు. ఇంద్రియాలు జడాలు. విషయాలను నాశనం చెయ్యటం మన వల్లకాదు. ఇంద్రియాలు దేని పని అది చేస్తుంటాయి. ఒకదాని పని ఇంకొకటి చెయ్యలేదు. అంటే వినే చెవులు ఆశక్తితో చూడలేవు. కాబట్టి ఏ యింద్రియానికి ఆ యింద్రియానికి చిదగ్ని వేరుగా ఉంటుంది.
పిండాండములాగానే చిదగ్నులు కూడా చాలారకాలున్నాయి. ఈ రకంగా ప్రపంచంలో ఉన్న అనంతజ్ఞానాగ్ని సముదాయమే చిదగ్చికుండము.
ఈ రకంగా పరమేశ్వరి చిదగ్నికుండ సంభుతా అని పిలవబడుతోంది.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below