శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని మూడవ నామం : శ్రీమత్ సింహాసనేశ్వరీ
"ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః"
భాష్యం
ఇక్కడ పరమేశ్వరి లయకారిణి ఈ రకంగా మొదటి మూడు నామాలలోను సృష్టి స్థితి లయాలు చెప్పబడ్డాయి. రాజులు సభలలో కూర్చునే ఆసనాన్ని సింహాసనము అంటారు. మృగాలలో శ్రేష్టమైనది సింహము. అడవికి రాజు. పరాక్రమానికి కూడా చిహ్నము. అందుచేతనే రాజుగారు తన వీరత్వానికి, పరాక్రమానికి గుర్తుగా సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ ఆసనానికి రెండువైపులా సింహాలు ఉంటాయి. రాజు భయంకరమైన క్రూరమృగమైన సింహాన్ని తాను ఓడించి ఆసనంగా చేసుకున్నాడు అని ఇక్కడ అర్ధం. అటువంటి సింహాసనం ఆసనంగా కలది ఆ పరమేశ్వరి. దేవీపురాణంలో, మహిష్మతి అనే గంధర్వకాంత శాపవశాన మహిషిగా జన్మించింది. ఆ మహిషికీ, రంభుడు అనే
రాక్షసుడికి జన్మించినవాడు మహిషాసురుడు. అతడు ముల్లోకాలను జయించాడు. దేవతలందరూ విష్ణువును శరణుజొచ్చారు. అప్పుడు అందరి దేవతల యొక్క అంశలతో తేజోరాశి అయిన స్త్రీమూర్తి ఉద్భవించింది. ఆవిడే పరమేశ్వరి. ఆవిడకు దేవతలందరూ తమ తమ శక్తులను ఇచ్చారు. ఆ సమయంలో హిమవాన్ వాహనం సింహం రత్నాని వివిధాని చహిమవంతుడు ఆ దేవికి వాహనంగా ఒక సింహాన్ని, వివిధరకాలయిన రత్నలను ఇచ్చాడు. ఆ సింహం మీద ఎక్కి దేవి మహిషాసుర సంహారం చేసింది. అందుచేతనే ఆమె సింహాసనేశ్వరీ అని చెప్పబడింది.
సింహాసనము అనే పేరుగల ఎనిమిది మంత్రాలు చైతన్యభైరవి దగ్గరనుండి సంపత్ర్రదాభైరవి దాకా ఉన్నాయి. వీటిలో మొదటి ఆరుమంత్రాలు మూడు జతలుగాను, తరువాత ఒక్కొక్కటిగాను మొత్తం ఐదు దిక్కులందు ఐదు సింహాసనములు గలది ఆ పరమేశ్వరి అని జ్ఞానార్దవ తంత్రంలో చెప్పబడింది.
పరమేశ్వరి ఐదు సింహాసనాలు ఏవిధంగా ఎక్కిందో శివుడు పార్వతికి వివరిస్తున్నాడు. ఓ దేవి సృష్టి కర్త అయిన బ్రహ్మ నిశ్చతనుడుగా ఉన్నప్పుడు పరమేశ్వరిని ధ్యానించి సృష్టి కర్త అయినాడు. ఆ తరువాత ఇంద్రుడు బ్రహ్మను గురించి తపస్సుచేసి పూర్వదిక్పాలకు డైనాడు. అప్పుడు ఆ త్రిపురసుందరి పూర్వసింహాసనమధిష్టించింది. యముడు బ్రహ్మను గురించి తపస్సుచేసి దక్షిణ దిక్కుకు అధిపతి అయినాడు. అప్పుడు ఆ దేవి దక్షిణ సింహాసనమలంకరించింది. వరుణుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి పశ్చిమదిక్కుకు అధిపతి అయినాడు. అప్పుడు ఆ దేవి పశ్చిమ సింహాసనమలంకరించింది. కుబేరుడు బ్రహ్మను మెప్పించి ఉత్తరదిక్కుకు అధిపతి అయినాడు అప్పుడు ఆ దేవి ఉత్తర సింహాసనమధిష్టించింది. బ్రహ్మ సృష్టికర్తకాగానే ఆ దేవి ఊర్ధ్వదిక్కున ఉన్న సింహాసనం అధిష్టించింది. ఈ రకంగా ఐదు దిక్కులయందున్న సింహాసనాలను ఆ దేవి అధిష్టించింది. అందుకే ఆమె సింహాసనేశ్వరి అనబడుతోంది.
ఆ దేవి అధిష్టించినది ఒట్టి సింహాసనం కాదు. మహాసింహాసనం. శ్రీమత్ అంటే గొప్పదైనటువంటి అని అర్ధం. మామూలుగా సింహాసనానికి నాలుగుకాళ్ళుంటాయి. కాని దేవతలు కూర్చునే సింహాసనానికి మధ్యన ఇంకొక కాలు ఉంటుంది. ఈ రకంగా ఐదు కాళ్ళుంటాయి. అందుకే దాన్ని శ్రీమత్సింహాసనము అంటారు.
త్రిపురసుందరి పంచాసనాసీన. పంచాసనాలంటే
1. పంచప్రణవాసనము : శ్రీం, హ్రీం, క్తీం, ఐం, సౌః, అనేవి పంచప్రణవాలు. వాటినే శక్తి ప్రణవాలు అంటారు. షోడశి మహామంత్రంలో ఈ ప్రణవాలను చెప్పటం జరుగుతుంది. ఈ ప్రణవాల మీద మంత్రరూపంలో ఆ దేవి ఉంటుంది.
2. పంచకలాసనము : నివృత్తి, ప్రతిష్టా, విద్యా, శాంతి, శాంత్యతీతములు పంచకలలు. వీటికి పైన చిత్కలగా ఉన్నది.
౩. పంచదిగాసనము : పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, మధ్యదిక్కులు ఎల్లలుగా గల బ్రహ్మాండమును పాలించునది.
4. పంచభూతాసనము: పృథివి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనే పంచభూతాలకు పైన ఉండునది.
5. పంచముఖాసనము: సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములు పరమేశ్వరుని ముఖములు. ఈ ముఖములు గల ఆసనము నధిరోహించినది.
ఈ రకంగా దేవి ఐదురకాలయిన సింహాసనాలనధిష్టిస్తున్నది. కాబట్టి శ్రీమత్సింహాసనేశ్వరీ అనబడుతోంది.
షట్బక్రాలలోను భక్తులు, సాధకులు పరమేశ్వరిని అర్చిస్తారు. అలా అర్చించేటప్పుడు ఒక్కొక్క చక్రంలో అర్చించే వారికి ఒక్కొక్కరకమైన ముక్తి కలుగుతుంది.
ఆధారస్వాధిష్టానాలు అంధకారబంధురాలు. వాటిలో ముక్తిలేదు. ఇక
1. మణిపురంలో దేవిని పూజించే వారికి సార్పిరూపముక్తి కలుగుతుంది. అంటే దేవి పురానికి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు.
2. అనాహతంలో దేవిని అర్చించే వారికి సాలోక్యముక్తి కలుగుతుంది. వీరు దేవి పట్టణంలోనే నివసించగలుగుతారు.
3. విశుద్ధి చక్రంలో దేవిని అర్చించేవారికి సామీప్యముక్తి కలుగుతుంది. వీరు దేవికి అతి దగ్గరగా సేవకులుగా ఉంటారు.
4. ఆజ్ఞా చక్రంలో దేవిని అర్చించే వారికి సారూప్యముక్తి కలుగుతుంది. వీరు వేరే దేహం ధరించి దేవితో సమానమైన రూపంలో ఉంటారు.
5. సహస్రారంలో దేవిని అర్చించే వారికి సాయుజ్యం కలుగుతుంది. వీరికి మరుజన్మ ఉండదు.
దేవతలలో ప్రసిద్ధులైన త్రిమూర్యాదులు ఆ పరమేశ్వరికి అతి దగ్గరగా ఉండి సేవించాలి అనే కోరిక కలవారై సామీప్యముక్తిని పొందారు. దీన్నే శంకర భగవత్సాదులవారు తమ సౌందర్య లహరి లోని 92వ శ్లోకంలో వివరిస్తూ
గతా ప్తే మంచత్వం ద్రుహిణహరిరు ద్రేశ్వరభృతః
శివ స్వచ్చచాయా కపట ఘటిత ప్రచృదపటః
త్వదీయానాం భాసాం ప్రతిఫలనరాగారుణతయా
శరీరీ శృంగారో రస ఇవ దృశాం కుతుకమ్ ॥
ఓ తల్లీ ! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అనువారు నీకు అతి సమీపంగా ఉండి, నిన్ను సేవించుకోవాలి అనే తలంపుతో మొదటి నలుగురు నీ సింహాసనానికి నాలుగు కోళ్ళుకాగా సదాశివుడు నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు.
అటువంటి పంచబ్రహ్మలు పరమేశ్వరి సింహసనానికి కోళ్ళుగా ఉన్నారు కాబట్టి ఆ దేవి శ్రీమత్ సింహాసనేశ్వరీ అనబడుతుంది.
మహాసింహాసనము అనేది ఒక మంత్రరాజం. ఆ మంత్రానుష్థానం చేసిన వారికి ప్రపంచంలోని అన్ని మంత్రాలమీదా అధికారం వస్తుంది. ఇది ఉత్తరదేశంలో బహుళ ప్రచారంలో ఉంది. ఆ మంత్రానికి అధిదేవత త్రిపురసుందరి. కాబట్టి దేవి శ్రీమత్సింహాసనేశ్వరి అని పిలువబడుతున్నది. ఈ రకంగా మొదటి మూడు నామాలు త్రిగుణస్వరూపమును అనగా సృష్టి స్థితి లయాలను సూచిస్తున్నాయి.
ఓం శ్రీ మాత్రే నమః
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below