కార్తీక సోమవారవ్రత మహిమ
కార్తీక సోమవారవ్రత మహిమ
◆ కుక్కకి కూడా కైవల్యాన్ని ప్రసాదించగలిగిన వ్రతం ఇది
సోమవారాలంటే సోమేశ్వరుడికి అంత్యంత ఇష్టం. అందులోనూ కార్తీకమాసం లో వచ్చే సోమవారాలు మరింత ప్రీతికరం అని చెబుతుంది కార్తీక పురాణం. సోమవారం వ్రతాన్ని గురించి చెబుతూ కుక్కకి కూడా కైవల్యాన్ని ప్రసాదించగలిగిన ప్రాశస్తి ఈ కార్తీక సోమవారాల వ్రతానికి ఉందని చెబుతుంది. ఆ కథేమిటో చూద్దాం పదండి.
వ్రతము :-
కార్తీకపురాణాతర్గతమైన సోమవారవ్రత విధానమిలా ఉంది.
కార్తీకసోమవారం నాడు నదీస్నానం చేసి, రోజంతా ఉపవాసం ఉండి, బిల్వాలతో శివుని పూజించి, అభిషేకించి, శక్తి కొలది దానధర్మాలు చేయాలి. ఆ తర్వాత సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని, భూతబలి చేసి (పశుపక్ష్యాదులు తినేందుకు కొద్దిగా ఆహారాన్ని బయట ఉంచాలి) ఆ తర్వాత భోజనము చేయాలి.
ఇలా నిష్ఠగా పూజ చేసిన తర్వాత, ఆ కార్తీక సోమవారం నాటి రాత్రి జాగరణ చేసి, ఆ సమయంలో పురాణపఠనం చేయాలి. ఉదయం తిరిగి స్నానాదికాలు, పూజ ముగించుకొని చేతనైనంత అన్నసంతర్పణ చేయాలి. అందుకు వీలుకాని పక్షంలో కనీసం ముగ్గురు బ్రాహ్మణులకి భోజనం పెట్టడం ఉత్తమం.
సోమవారవ్రత ఫలితం:-
మిత్రశర్మ అనే బ్రాహ్మణునికి ‘స్వాతంత్ర నిష్ఠురి‘ అనే కన్యతో వివాహం చేశారు. అతను వేదనిష్ఠ గలిగిన సాత్విక స్వభావి. కానీ ఆమెకి లేని దుర్లక్షణం లేదు. తాచెడ్డ కోతి వనమెల్లా చెరచిందని, తాను చేదుబాటని పట్టిందేకాక, ఇతర స్త్రీలని కూడా తనబాటలో నడిచేలా చేస్తూ దుర్మార్గంగా ప్రవర్తించేది. అయినా మిత్రశర్మ కోపగించుకోక, భార్యని సన్మార్గంలోకి తెచ్చుకునేందుకు నాలుగు మంచి మాటలు చెప్పేవారు. దాంతో అతని అడ్డు తొలగించుకోవాలని యోచించి, అతను నిద్రిస్తున్న సమయంలో బండరాయితో తలపై కొట్టి భర్త ప్రాణాలు తీస్తుంది.
ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టినందుకు అంతిమ ఘడియల్లో కుష్ఠు రోగాన బడి, చూసేవారు చేసేవారు దిక్కులేక నరకయాతనలు పడుతుంది. ఆ తర్వాత నరకలోకానికి చేరుకొని చేసిన పాపాలకి గానూ వర్ణించడానికి వీలులేని భయంకరమైన శిక్షలని అనుభవిస్తుంది. ఆ తర్వాత ఆమె పూర్వజులు చేసిన పుణ్యం కారణంగా కుక్కగా జన్మిస్తుంది. ఈ జన్మలోనూ తిండికీ, నీటికి మొఖంవాచి, చీత్కారాలతో అలమటిస్తూంటుంది.
ఒకనాటి కార్తీకమాసపు సాయంకాలం ఉదయంనుండీ ఆహారం దొరకక ఆ కుక్క ఆకలితో నకనకలాడుతోంది. అటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని శృతి బద్ధంగా ఆచరిస్తూ, తన ఇంటి అరుగుపైన పెట్టిన భూతబలి ఆమెకి కనిపిస్తుంది. దానిని తినగానే ఆమెకి పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. తానూ చేసిన క్రూర కర్మలన్నీ జ్ఞప్తికి వస్తాయి. తానూ అనుభవించిన నరకలోకపు శిక్షలు కళ్ళముందు మెదుల్తాయి. వాటిని గుర్తుచేసుకొన్న ఆమె దుఃఖిస్తూ రక్షించమని ఆ విప్రోత్తముడిని వేడుకుంటుంది.
తానూ చేసిన సోమవారం వ్రత ప్రసాదాన్ని గ్రహించిన ఫలితముగా ఆమెకి ఇటువంటి జ్ఞానము కలిగిందని తెలుసుకొని ఆ విప్రుడు ఎంతో సంతోషిస్తాడు. తాను ఆచరించిన సోమవారవ్రతంలోని ఒక్క సోమవారంనాటి ఫలితాన్ని ఆమెకి ధారపోస్తాడు. దాంతో ఆమె అక్కడి వారందరూ చూస్తుండగానే దివి నుండీ దిగివచ్చిన పుష్పకవిమానాన్ని అధిరోహించి శివసాయుద్యాన్ని పొందింది. అని సోమవార వ్రత మహిమని గురించిన ఈ కథని కార్తీక పురాణంలో జనక మహారాజుకి, వసిష్ఠ మహర్షి వివరించారు.
కాబట్టి అద్భుతమైనది, అనంత ఫలాన్ని ఇచ్చేది అయిన సోమవారం వ్రతాన్ని కార్తీకమాసంలో నైనా తప్పక ఆచరిద్దాం. సోమేశ్వరుని అనుగ్రహాన్ని అందుకొని ధన్యజీవులమై చరిద్దాం.
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !
- స్వస్తి-
|| ఓం శ్రీమాత్రేనమః ||