కార్తీకపురాణం 12 వ అధ్యాయం
కార్తీకపురాణం 12 వ అధ్యాయం
మహారాజా! కార్తీకమాసము లో కార్తీక సోమవారము నాటి కార్తీక ద్వాదశీవ్రతమును గురించి సాలగ్రామ మహిమలను గురించి వివరిస్తాను విను" అని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియచేశారు .
కార్తీక సోమవారము నాడు ఉదయమునే లేచి కాల కృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయాలి. తరువాత శక్తి కొలదీ బ్రాహ్మణునకు దానమిచ్చి ఆరోజంతా ఉపవాస ముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణ్యాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని ఆ ఆతర్వాత భుజించాలి.
ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాకుండా మోక్షము కూడా ప్రాప్తిస్తుంది. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చినట్లయితే ఈ వ్రతం ఆచరించిన వారు నూరు రెట్లు ఫలితము పొందగలరు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున, పూర్ణోపవాసముండి అ రాత్రి విష్ణ్యాలయమునకు వెళ్లి శ్రీ హరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసినట్లయితే కోటి యజ్ఞముల ఫలితము కలుగుతుంది.
ఈ విధముగా చేసినవారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటె అధికమైన ఫలితం లభిస్తుంది. కార్తీక_శుద్ధద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేష పానుపు నుండీ లేస్తాడు. కాబట్టి కార్తీక_శుద్ధద్వాదశీ వ్రతము విష్ణువునకు చాలా ప్రీతికరమైనది.
ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవుకొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చినట్లయితే ఆ ఆవు శరీరంపైన ఎన్నిరోమములు ఉన్నాయో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అనుభవించగలరు. కార్తీకమాసములో వస్త్రదానము చేసినా గొప్పఫలము కలుగుతుంది.
ఇంకా కార్తీక శుద్ధపాడ్యమి రోజున కార్తీకపౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మములో చేసిన సకల పాపములు హరించిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చినవారు ఇహపర సుఖములను పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసిచెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినట్లయితే నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగుతుంది.
దీనికి ఉదాహరణముగా ఒక కథ చెబుతాను శ్రద్ధగా ఆలకింపుమని ఇలా చెప్పసాగారు.
పూర్వము అఖండ గోదావరీ నదీతీరములోని ఒకానొక పల్లెలో ఒక వైశ్యుడు నివసిస్తుండేవాడు. అతను దురాశా పరుడై నిత్యము ధనమును కూడబెట్టేవాడు. తాననుభవించక, యితరులకు పెట్టక, బీదలకు దానధర్మములు చేయక, యెల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విఱ్ఱ వీగుతూ , ఏజీవికీ కూడా కనీస ఉపకారమైన చేయక పరుల ద్రవ్యములని ఎలా అపహరించాలా అనే ఆలోచనలతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుతుండేవాడు.
అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకి తనవద్ద ఉన్న ధనమును పెద్దవడ్డీకి అప్పు ఇచ్చాడు. మరికొంత కాలమునకి తనసొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు "అయ్యా! తమకీయవలసిన ధనము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను. మీ ఋణముంచుకోను. ఈ జన్మలో తీర్చలేకపోతే మరుజన్మలో మీయింట ఏజంతువుగానో పుట్టి అయినా మీ ఋణము తీర్చుకుంటాను అని వినయముగా వేడుకున్నాడు. ఆ మాటలకు కోమటి మండిపడి అలా జరగడానికి వీలులేదు. నాసొమ్ము నాకిప్పుడే కావాలి ఇప్పుడే ఇవ్వాల్సిందే. ఇవ్వకపోయావో, నీకంఠము నరికి వేయగలను అని ఆవేశం కొద్దీ వెనుకముందు ఆలోచించకుండా తన మొలనున్న కత్తి తీసి ఆ బ్రాహ్మణుని తల నరికేశాడు.
వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉంటె తనని రాజభటులు వచ్చి పట్టుకోగలరని భయపడి తన గ్రామమునకు పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటినుండి ఆ వైశ్యునకి బ్రహ్మహత్యాపాపము ఆవహించి కుష్ఠువ్యాధి సంక్రమించి నానా బాధలూ పడుతూ మరికొన్నాళ్లకు మరణించాడు.
వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరకకూపములలో పడేశారు. ఆవైశ్యునకి ఒక కుమారుడున్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మాలు చేస్తూ, పుణ్యకార్యములు ఆచరిస్తూ, బాటసారులకు నీడ కోసం చెట్లు నాటిస్తూ, నూతులు, చెరువులు త్రవ్విస్తూ, సకల జనులను సంతోష పెడుతూ, మంచి కీర్తిని సంపాదించాడు.
ఇదిలాఉండగా కొంత కాలానికి త్రిలోక సంచారి అయిన నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి దారిలో ధర్మవీరుని యింటికి వేంచేశారు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి, చేతులు జోడించి "మహానుభావా! నా పుణ్యం కొలదీ నేడు నాకు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నాజన్మ తరించింది. నాయిల్లు పావనమైంది. శక్తికొలదీ నే జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరించండి " అని సవినయుడై వేడుకున్నాడు. అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి "ఓ ధర్మవీరా! నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు.
ఆరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసినా అత్యంత విశేషమైన ఫలం కలుగుతుంది. నాలుగు జాతులలో ఏజాతివారైననూ స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా, చోరుడైనా, పతివ్రతయైనా, వ్యభిచారిణియైనా కార్తీక శుద్ధద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా నిష్ఠగా ఉపవాసముండి, సాలగ్రామ దానములు చేసినట్టయితే వెనుకటి జన్మలలోనూ, ఈ జన్మలోనూ చేసిన పాపములన్నీ నశించి పోతాయి.
నీతండ్రి యమలోకంలో మహానరక మనుభవిస్తున్నాడు. అతనిని వుద్ధరించడానికై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అలా చేసి నీతండ్రి ఋణం తీర్చుకో " మని ఉపదేశించాడు. అప్పుడు ధర్మవీరుడు "నారద మునివర్యా! నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలైన మహాదానములు చేశాను.
అటువంటి మహా దానములు చేసినప్పటికీ, నా తండ్రికి మోక్షము కలుగనప్పుడు, "సాలగ్రామ" మనే రాయిని దానము చేసినంత మాత్రమున ఆయన ఏవిధంగా ఉద్ధరింపబడతారో అనే సంశయము కలుగుతోంది. ఈ రాయి వలన ఆకలితో ఉన్నవాడి ఆకలి తీరుతుందా ? దాహంతో ఉన్నవాడికి దాహం తీరుతుందా ? అటువంటి ఉపయోగాలేమీ లేనప్పుడు ఎందుకీ దానము చేయాలి ? నేనీ సాలగ్రామదానము మాత్రము చేయనని” నిష్కర్షగా చెప్పాడు.
నారదుడు ధర్మవీరుని అవివేకమునకు విచారించి "వైశ్యుడా! సాలగ్రామమును శిలామాత్రముగా తలపోశావు. అది శిల కాదు. స్వయంగా శ్రీహరి యొక్క రూపము. అన్నిదానములకంటె, సాలగ్రామదానము చేసినందువల్ల కలిగే ఫలమే గొప్పది. నీ తండ్రి నరకబాధనుండి విముక్తి పొందాలి అనుకుంటే ఈ దానము తప్ప మరొక మార్గము లేదు. ఆపై నీ ఇష్టమని " అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు.
ధర్మవీరుడు ధనబలము గలవాడైయుండి, దానసామర్ధ్యము కలిగియుండి కూడా, సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టడం చేత మరణాంతరం యేడు జన్మలలో పులిగా పుట్టి, మరో మూడు జన్మలలో వానరమై పుట్టి, ఐదుజన్మలు ఎద్దుగా పుట్టి, పదిజన్మలు మానవ స్త్రీగా పుట్టి, ఆ తర్వాత పది జన్మలు పందిగా జన్మించాడు.
ఆ విధంగా జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రహ్మణుని యింట స్త్రీగా జన్మించాడు. ఆమెకు యౌవన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఆమెను ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాడు. పెండ్లి అయిన కొంతకాలమునకె ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనములోనే ఆమెకు అష్టకష్టాలు కలిగినందుకు ఆమె తల్లితండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించారు. తండ్రి, ఆమెకు ఈ విపత్తు ఎందువల్ల కలిగిందాయని ఆలోచించి, తన దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ‘నాకు బాల వైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక’ అని ఆమె చేత సాలగ్రామ దానము చేయించి ఆ సాలగ్రామ దానఫలమును ధార పోయించాడు.
ఆరోజు కార్తీక సోమవారమవడం వలన ఆ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త తిరిగి జీవించాడు. అటు తర్వాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి, జన్మాంతరమున స్వర్గముని పొందారు. మరికొంత కాలమునకు ఆ బ్రహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామదానము చేస్తూ ముక్తిని పొందింది.
కాబట్టి, ఓ జనకా! కార్తీక శుద్ధద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము యింతింత అని చెప్పనలవి గాదు. అది ఎంతో ఘనమైనది. కాబట్టి నీవు కూడా సాలగ్రామ దానమును చేయమని. "వసిష్ఠ మహర్షి తెలియజేశారు .
స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, పన్నెండవ అధ్యాయము - పన్నెండవ రోజు పారాయణము సమాప్తము.
*ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వాదశోధ్యాసమాప్తః*
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !
- స్వస్తి-
|| ఓం శ్రీమాత్రేనమః ||